Actor Vijay: భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడమే కాకుండా, ఆ పార్టీకి అన్ని రకాలుగా మద్దతుగా పని చేయాని తమిళ్ సూపర్ స్టార్ విజయ్ను రాష్ట్ర అసెంబ్లీ బీజేపీపక్ష నేత నయినార్ నాగేంద్రర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్రంలోని తరునల్వేలిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా అభిమానులు స్థాపించిన సంఘాన్ని రాజకీయ పార్టీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు సైతం అతికిస్తున్నారు.
దీనిపై నయినార్ స్పందిస్తూ కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని అభిమానులు పోస్టర్లు అతికించడం తప్పుకాదని, రాజకీయాల్లో సినీ రంగ ప్రముఖులేకాక ఎవరైనా రావచ్చునని అన్నారు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే ఎవరికి ఎంత ప్రజా బలం ఉందో తెలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంలోనే బీజేపీకి మద్దతుగా పనిచేయాలని నటుడు విజయ్‌ని ఆహ్వానిస్తారా అని విలేఖరులు ప్రశ్నించగా.. శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి పనిచేయడానికి నటుడు విజయ్‌తోపాటు అందరినీ ఆహ్వానిస్తామని నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు.