దయచేసి అడ్డుకోండి, సీఎం జగన్‌కు లోకేష్ లేఖ

nara lokesh letter to cm jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై లోకేష్ స్పందించారు. సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని లేఖలో కోరారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని లోకేష్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కనీస కేటాయింపులు సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని లోకేష్ అన్నారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాకారం అయిన స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. దీని ద్వారా వేలమంది ప్రత్యక్షంగా, లక్షలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మణిహారంగా వెలుగొందుతున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే సీఎం జగన్ రెడ్డి మౌనం దాల్చడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. 28మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం? అని నిలదీశారు.

“పరిపాలన రాజధాని అంటే ఇలా ఒక్కొక్క పరిశ్రమను అమ్మేయడమేనా? అడవులు, కొండల్ని కబ్జాలు చేయడమేనా? కాకినాడ పోర్టును విజయసాయిరెడ్డి అల్లుడికి వరకట్నంగా రాసిచ్చేశారు. విశాఖ ఏజెన్సీలోని లేటరైట్ గనులను బాబాయ్ సుబ్బారెడ్డికి బహూకరించారు. తన దోపిడీ మత్తుకు మంచింగ్ గా మచిలీపట్నం పోర్టును నంజుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకు కొని దోపిడీ వికేంద్రీకరణ పరిపూర్ణం చేసుకోబోతున్నారు” అంటూ విమర్శలు గుప్పించారు లోకేష్.

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని, కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం నిర్ణయం వివాదానికి దారితీసింది. యాజమాన్య హక్కులను పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడడం పట్ల రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తామని పవన్ వెల్లడించారు. విశాఖ ఉక్కు ఏపీ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు.

ప్రైవేటు పరం కానివ్వం-పవన్
22 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం 17వేల మంది పర్మినెంటు ఉద్యోగులకు, 16వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు, లక్షమంది వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ఇంతటి గొప్ప ప్లాంటు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం జనసేన అభీష్టానికి వ్యతిరేకం అన్నారు. నాడు ఈ కర్మాగారం కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని, 32మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. త్యాగాల ఫలితంగా సాకారమైన ఉక్కు కర్మాగారం చేతులు మారుతోందంటే తెలుగువారికి ఆమోదయోగ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మన్మోహన్ సింగే కారణం:
అసలు, పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్ సింగేనని పవన్ ఆరోపించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ కర్మాగారం కూడా పెట్టుబడుల ఉపసంహరణ పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని, కర్మాగారాన్ని కాపాడుకుంటామని తేల్చి చెప్పారు.