Telangana Congress : ఒకే ఛాన్స్..! టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో కొత్త రూల్‌..!

కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయంతో రేసులో ముందన్నట్లు కనిపించిన ముగ్గురు నేతలు అనూహ్యంగా అవకాశం కోల్పోయినట్లేనని అంటున్నారు.

New Rule In Telangana Congress

Telangana Congress : టీ కాంగ్రెస్‌ లీడర్లకు కాంగ్రెస్‌ అధిష్టానం ట్విస్ట్‌ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ కొత్త మెలిక పెట్టింది. అగ్రనాయకత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ముగ్గురు సీనియర్‌ లీడర్ల ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.

రాహుల్ గాంధీ కీలక ఆదేశం..
పార్లమెంట్‌ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ అధిష్టానం కొత్త రూల్‌ తెచ్చింది. ఒకరికి ఒకేసారి అవకాశం అన్న కొత్త కండీషన్‌తో ముగ్గురు సీనియర్‌ లీడర్ల లోక్‌సభ ఆశలపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చిన వారికి మళ్లీ లోక్‌సభ పోటీకి అవకాశం ఇచ్చేది లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఆదేశించారు. దీంతో టీ కాంగ్రెస్‌లోని సీనియర్‌ నేతలు టి.జీవన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, మైనంపల్లి హన్మంతరావులకు ఈసారి అవకాశం దక్కేలా కనిపించడం లేదు.

జీవన్‌రెడ్డి, సంపత్‌, మైనంపల్లికి అవకాశం లేనట్లే!
పార్టీలో అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఒకరికి ఒకేసారి పోటీ చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది కాంగ్రెస్‌. దీనివల్ల కొత్తవారికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తోంది. ఇప్పటికే పోటీ చేసి ఓడిపోయిన వారికి మళ్లీ అవకాశమిస్తే.. యువతరానికి చాన్స్‌ ఇవ్వలేమని భావిస్తోంది. దీంతో జీవన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, మైనంపల్లి హన్మంతరావుల పేర్లకు బదులుగా కొత్తవారి పేర్లు తెరపైకి వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బలమైన నేత. ఈ కారణంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్‌రెడ్డి. అదేవిధంగా అలంపూర్‌లో పోటీ చేసిన ఓడిన సంపత్‌కుమార్‌ నాగర్‌ కర్నూల్‌ నుంచి, మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి లేదా మెదక్‌ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలని ఆశించారు.

మరో ఛాన్స్ ఇవ్వలేమన్న హైకమాండ్..
నిన్నమొన్నటివరకు ఆయా నియోజకవర్గాలకు ఈ ముగ్గురు నేతల పేర్లే విస్తృతంగా ప్రచారం జరిగాయి. తొలి జాబితాలోనే వీరి పేర్లు ఉంటాయని భావించారు. నాగర్‌ కర్నూల్‌లో సంపత్‌కుమార్‌కు పోటీగా మల్లు రవి టికెట్‌ ఆశించడం వల్ల కొంత పోటీ కనిపించింది. ఐతే కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్ విడుదల సందర్భంగా.. గతంలో పోటీకి అవకాశం ఇచ్చిన వారికి మరో చాన్స్‌ ఇవ్వలేమని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చేయడంతో జీవన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, హన్మంతరావులకు దాదాపు టికెట్‌ లేనట్లేనని ప్రచారం జరుగుతోంది.

లోక్‌సభ బరిలో ప్రొఫెసర్‌ కోదండరాం, ఈరవత్రి అనిల్‌, నీలం మధు..!
వీరికి ప్రత్యామ్నాయంగా మల్కాజ్‌గిరిలో ప్రొఫెసర్‌ కోదండరాం, నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి, మెదక్‌లో నీలం మధు, నిజామాబాద్‌లో ఈరవత్రి అనిల్‌కుమార్‌ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నలుగురు నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించలేకపోయింది కాంగ్రెస్‌. ఎమ్మెల్సీ హామీతో కోదండరాం పోటీ నుంచి తప్పుకోగా, నీలం మధుకు పటాన్‌చెరు టికెట్‌ కేటాయించి ఒక్కరోజులోనే వెనక్కి తీసుకుంది. ఇక ఈరవత్రి అనీల్‌, మల్లు రవి పూర్తిగా పార్టీ సేవకే పరిమితమయ్యారు. దీంతో లోక్‌సభకు వీరి పేర్లను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయంతో రేసులో ముందన్నట్లు కనిపించిన ముగ్గురు నేతలు అనూహ్యంగా అవకాశం కోల్పోయినట్లేనని అంటున్నారు.

Also Read : ఎన్నికల వేళ బీజేపీ మూడంచెల వ్యూహం

 

ట్రెండింగ్ వార్తలు