గులాబీ పార్టీలో పరిచయం అక్కర లేని వ్యక్తి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ప్రస్తుతం ఓదేలు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ముందస్తు ఎన్నికల్లో ఓదేలు స్థానంలో ఎమ్మెల్యే టికెట్‌ను బాల్క సుమన్‌కి కేటాయించింది. దీంతో ఓదేలు అనుచర వర్గం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనలు చేసింది. తర్వాత కేసీఆర్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ రావడంతో.. ఆయన బాల్క సుమన్ గెలుపునకు పని చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓదేలుకు నిరాశ ఎదురైంది. పెద్దపల్లి నుంచి పోటీకి ఓదేలు పేరు తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి జాయిన్ అయిన బొర్లకుంట వెంకటేష్ నేతకు టికెట్ కేటాయించింది. ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తామని పార్టీ గతంలో హామీ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. మంథని, ఆసిఫాబాద్‌లలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు జడ్పీ చైర్మన్లుగా ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మెన్‌గా ఓదేలును కానీ వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఓదేలును ప్రకటించకపోవడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీతో ఓదేలు టీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లోనూ ఓదేలును టీఆర్ఎస్ వర్గాలు పూర్తిగా పక్కన పెట్టేయడంతో…ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓదేలు, అతని వర్గీయులు వ్యవహరించిన తీరుపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓదేలు వర్గం అంతా సుమన్‌కి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉండటంతో ఓదేలుకి రాజకీయంగా ఎలాంటి పదవులు వచ్చే అవకాశమే లేదని పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి.