దిశ ఘటనలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దిశ ఘటనలో తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. దిశను చంపిన వారిని రెండు బెత్తం
దిశ ఘటనపై తన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దిశ ఘటనలో తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. దిశను చంపిన వారిని రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని నేను చెప్పలేదని పవన్ వివరించారు. అత్యాచారాలకు పాల్పడే వారిని బహిరంగంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని సౌదీ అరేబియా తరహాలో కాల్చేయాలన్నారు. బహిరంగంగా కాలు, చెయ్యి తీసేయాలన్నారు. ఇలాంటివి చేసినప్పుడే తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి వస్తుందన్నారు. రేపిస్టులకు సింగపూర్, సౌదీ అరేబియా తరహాలో శిక్షించలు విధించాలని తాను చెప్పానని పవన్ అన్నారు.
వైసీపీ నేతల తలలు నరుకుతా అంటూ జనసేన నేత సాకే పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో.. పవన్ స్పందించారు. సాకే పవన్ పొరపాటున మాట్లాడాడని చెప్పారు. సాకే పవన్ వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదన్నారు. వైసీపీ నేతలు ఫోన్ లో పదేపదే బెదిరిస్తుంటే.. ఆవేదన చెప్పుకోవడానికే సాకే పవన్ వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడని జనసేనాని వివరించారు.
సాకే పవన్ ను తప్పుబడుతున్న వారు.. మాజీ సీఎం చంద్రబాబుని నడిరోడ్డుపై ఉరితీయాలని జగన్ అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని జనసేనాని అడిగారు. వెనుకబడ్డ కులానికి చెందిన వ్యక్తిని క్షమించలేమా అని ప్రశ్నించారు. రెండు కులాల మధ్య పోరాటంగా వైసీపీ నేతలు చూడొద్దని పవన్ కోరారు.
కర్నూలులో రెండేళ్ల క్రితం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో మైనర్ బాలిక అత్యంత కిరాతకంగా ఉరితీయబడిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. లేదంటే కర్నూలులో జనసైనికులు రోడ్డెక్కుతారని పవన్ వార్నింగ్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.