ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సీఎం జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అయ్యారు.
2019, నవంబర్ 14వ తేదీ గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పవన్ నాయుడు అని వైసీపీ నేతలు తనను ఎగతాళి చేస్తున్నారని..జగన్ రెడ్డి అంటూ ఆయన పేరు పెట్టి పిలిస్తే తప్పేంటని సూటిగా ప్రశ్నించారు.
జాతీయ మీడియా మొత్తం అలాగే పిలుస్తుందని గుర్తు చేశారాయన. జగన్ ను ఎలా పిలవాలో 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేయాలని ఎద్దేవా చేశారు. ఇంగ్లీషు రాదని డబ్బులు సంపాదించకుండా ఉన్నారా ? సీఎం జగన్ క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు.. దాచుకోవాల్సిన అవసరం ఏంటీ అన్నారు. తిరుపతి ప్రసాదం జగన్ తింటారో లేదో తనకు తెలియదన్నారు. కుల, మతాలకు అతీతంగా రాజకీయాలు చేయడం తమ పార్టీ విధానమన్నారు. భాషలను గౌరవించే సంప్రదాయం జనసేనదన్నారు. తెలుగు భాషను చంపేస్తామంటే ఎలా ఊరుకుంటానన్నారు. భాషా సరస్వతిని అవమానిస్తున్నారని, కుల నిర్మూలన తన ఆశయమన్నారు పవన్.
కాగా, తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. మరో పదేళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోందన్నారు. ఎక్కడ చూసినా ఇంటర్ నెట్ కనిపిస్తోందన్నారు. ఇంగ్లిష్ చదువులు లేకపోతే మన పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. గురువారం (నవంబర్ 14, 2019) ప్రకాశం జిల్లా ఒంగోలులో నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించారు జగన్.
Read More : తెలుగు మీడియంలో చదివితే పిల్లల తలరాతలు మారవు