Pawan Chandrababu Meeting : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఆ స్థానాలు మార్చాలని విజ్ఞప్తి

అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరు నేతలు అన్నీ తామై వ్యవహరించాలన్నారు. ఇరువురు నేతలూ సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు.

Pawan Chandrababu Meeting

Pawan Chandrababu Meeting : రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పావులు కదుపుతోంది. ఎలాగైనా జగన్ నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపైనా ఇద్దరు నేతలూ చర్చించుకున్నారు.

పొత్తులో భాగంగా జనసేనకు రెండు ఎంపీ, 24 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. ఎంపీ స్థానాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. తమ పార్టీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాల విషయంలోనే కొన్ని మార్పులు చేర్పులు కావాలని అడుగుతున్నారు పవన్ కల్యాణ్. స్థానిక పరిస్థితుల దృష్ట్యా జనసేనకు కేటాయించిన కొన్ని సీట్ల విషయంలో పునరాలోచన చేయాలని కోరినట్లు సమాచారం. ఆంధ్రలో ఒకటి, రాయలసీమలో ఒక సీటుని మార్చాలని పవన్ కోరుతున్నారు. విశాఖ సిటీలో కూడా ఒక సీటు మార్పు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. పొత్తులో భాగంగా కేటాయించిన కొన్ని స్థానాల్లో మూడు పార్టీల కార్యకర్తల నడుమ సమన్వయం కుదిరేలా చూడాలని చర్చించారు. అసంతృప్తులతో సమావేశమై భవిష్యత్తులో వారికి పదవులు ఇవ్వడం, సముచిత స్థానం కల్పించేలా భరోసా కల్పించేలా మాట్లాడాలని నిర్ణయించారు.

అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరు నేతలు అన్నీ తామై వ్యవహరించాలన్నారు. ఇరువురు నేతలూ సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 26 నుంచి ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నెల 27 నుంచి వారాహిపై పర్యటిస్తారు పవన్ కల్యాణ్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

Also Read : వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీతో పవన్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?- వైసీపీలో చేరిన వంగవీటి నరేంద్ర