చంద్రబాబు ఇంటి గేట్లను తాళ్లతో కట్టేసిన పోలీసులు

  • Publish Date - September 11, 2019 / 06:30 AM IST

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత  చంద్రబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. బాబు ఇంటి గేట్లను తాళ్లతో బంధించారు. దీంతో హైటెన్షన్‌ నెలకొంది. చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే ఆత్మకూరు వెళ్లాలన పట్టుదలగా ఉన్న చంద్రబాబు… కిందకు దిగకుండా కాన్వాయ్‌లోనే కూర్చున్నారు.

చంద్రబాబు ఇంట్లోంచి బయటకురాకుండా ఇంటి మెయిన్ గేట్‌కు పోలీసులు తాళం వేశారు. ఈ ఘటనపనై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శాంతి యుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని చంద్రబాబు పేర్కోన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని… వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.  కాగా… అక్రమ అరెస్టులకు నిరసనగా ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు. వారిని వ్యాన్‌లలో స్టేషన్‌కు తరలించారు.
 
బుధవారం నాటి ‘ఛలో ఆత్మకూరు’ను భగ్నం చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేస్తున్నారు.