వైసీపీ నేతలకు PK ఫీవర్‌ : అభ్యర్థుల పనితీరుపై సర్వే

వైసీపీ అభ్యర్థుల ప‌నితీరుపై ఆ పార్టీ ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా స‌ర్వేలు చేయించారు.

  • Publish Date - February 15, 2019 / 02:05 PM IST

వైసీపీ అభ్యర్థుల ప‌నితీరుపై ఆ పార్టీ ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా స‌ర్వేలు చేయించారు.

హైదరాబాద్ : వైసీపీ నేత‌ల‌కు ప్రశాంత్ కిషోర్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్‌ల‌తో పీకే స్వయంగా భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ ప‌నితీరుతోపాటు అభ్యర్థుల సామర్థ్యంపై పీకే ప‌లు నివేదిక‌లు సిద్ధం చేశారు. కొంద‌రి ప‌నితీరు మెరుగుకు సూచ‌న‌లు చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. మ‌రికొంద‌రి టికెట్లకు ఎర్త్ పెడుతున్నార‌న్న వార్తలు లోట‌స్‌పాండ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.

 

ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండ‌టంతో వైసీపీ అభ్యర్థుల ప‌నితీరుపై ఆ పార్టీ ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా స‌ర్వేలు చేయించారు. ఇప్పటికే అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్యర్థుల బ‌లాబ‌లాలపై నివేదిక‌ల‌ను పీకే టీమ్‌ సిద్ధం చేసింది. ఈ నివేదిక‌లను అధినేత జ‌గ‌న్‌కు ఇటీవ‌లే ప్రశాంత్ కిషోర్ అందించారు. అంతేకాకుండా ప‌నితీరు బాగున్న నేత‌ల‌తోపాటు పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో వెన‌క‌బ‌డిన అభ్యర్థుల జాబితాను కూడ సిద్ధం చేశారు పీకే. త‌న టీమ్‌ చేసిన స‌ర్వేలో నెగిటివ్ రిపోర్టు వ‌చ్చిన ఎమ్మెల్యేలు, అశావహుల‌తో స్వయంగా ప్రశాంత్ కిషోరే మాట్లాడుతున్నారాని లోటస్ పాండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

ఇటు గెలిచే అభ్యర్థుల‌కు విజ‌యావ‌కాశాలు మ‌రింత మెరుగుప‌డేలా పీకే స‌ల‌హాలు ఇస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి దూరంగా ఉన్న వివిధ సామాజిక వ‌ర్గాలకు ఎలా ద‌గ్గర కావాలో సూచిస్తున్నారు. ఇత‌ర పార్టీల్లోని బ‌ల‌మైన నేత‌ల‌ను పార్టీలోకి ర‌ప్పించ‌డంపై అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను కూడ అశావహుల‌కు పీకే వివ‌రిస్తున్నట్లు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు జ‌గ‌న్ ప్రక‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహాలు చెబుతున్నారు. ఈ రెండు నెల‌లు ప్రజ‌ల్లో ఉండ‌క‌పోతే జ‌రిగే న‌ష్టాల‌ను కూడ వారికి స్వయంగా పీకేనే వివ‌రిస్తున్నట్లు సమాచారం.

 

ఇదిలావుంటే స‌ర్వేలో వెన‌క‌బ‌డిన నేత‌ల‌ను టికెట్ గండం వెంటాడుతోంది. ఏళ్ల త‌ర‌బ‌డి  స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉండి టికెట్ రాక‌పోతే ఎలా అన్న ఆందోళ‌న సదరు నేత‌ల్లో క‌నిపిస్తోంది. కొత్తగా నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లు చేప‌ట్టిన చాలామంది నేత‌లు పార్టీని పటిష్టం చేయ‌లేక‌పోతున్నారని ప్రశాంత్ కిషోర్ స‌ర్వేలో వెల్లడైంది. దీంతో అలాంటి చోట్ల ఇత‌ర పార్టీల నేత‌లు వ‌చ్చేలా పీకే ఫ్లాన్ చేస్తున్నార‌ట. ప‌నితీరు బాగాలేని నేత‌ల‌కు చివ‌రి అవ‌కాశం ఇవ్వాల‌ని.. ఎన్నిక‌ల నాటికి కూడా వారి ప‌నితీరు మార‌క‌పోతే ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికే టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ కూడ సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ప్రశాంత్ కిషోర్ నుంచి పిలుపు వ‌చ్చిందంటే.. త‌న టికెట్ ఉందో.. ఊడిందోనన్న టెన్షన్ వైసీపీ నేత‌ల్ని కలవరపెడుతోంది.