Bihar Politics: దేశభక్తి, ధర్మ రక్షణ పేర్లతో విపక్షాలను చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ కార్నర్ చేస్తూ వచ్చింది. అయితే ‘ఇండియా’ అనే పేరు కూటమికి కొంత పాజిటివ్ అయినట్టే కనిపిస్తోంది. ఇండియా అనే పేరుపై విమర్శలు చేస్తే అది దేశానికి వ్యతిరేకంగా స్ఫూరించే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని తాజాగా రాష్ట్రీయ్ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తావించారు. దమ్ముంటే ఇండియాను తిట్టి చూడండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.
బిహార్ రాజధాని పాట్నాలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో ఆదివారం స్టూడెంట్ ఆర్జేడీ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ (BJP) వర్సెస్ ‘ఇండియా'(INDIA) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. విపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టడాన్ని చాలా మంది మెచ్చుకున్నారని చెప్పారు.
‘ఇండియా’ వ్యూహానికి సంబంధించి ముంబైలో మూడవ సమావేశం జరుగుతుందని లాలూ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అందరూ తమలో ఉన్న విభేదాలను మరచి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సూచిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘బీజేపీని తరిమికొట్టండి, నరేంద్ర మోదీని తరిమికొట్టండి’’ అనే నినాదాలు ప్రధానమైనవి అన్నారు. ఇక విపక్షాల ఐక్యతపై బీజేపీ తీవ్ర ఆందోళనకు గురవుతోందంటూ ఎద్దేవా చేశారు. ‘‘బీహార్‌లో పంచాయతీ స్థాయిలో ప్రతి గ్రామంలో బాబా సాహెబ్ గురించి చర్చ జరుగుతోంది. అన్నింటినీ వదిలి దేశం కోసం పోరాడాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. దేశ యువతే దేశ యోధులు. బీహార్‌లోని అనేక మంది అనుభవజ్ఞులు, స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యానికి సహకరించారు’’ అని లాలూ అన్నారు.