వైసీపీలో మార్పుల మంటలు.. మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ఎమ్మెల్యే కూడా టీడీపీ అధిష్టానంతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. జిల్లాలో ఇంకో రిజర్వు నియోజకవర్గం..

Satyavedu YSRCP

YCP : వైసీపీలో మార్పులు రేపిన మంటలు చల్లారడం లేదు. ఒకరి తర్వాత ఒకరుగా ఎమ్మెల్యేలు.. అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేస్తూ హాట్‌టాపిక్‌ అవుతున్నారు. తనను తప్పించి తిరుపతి ఎంపీ గురుమూర్తిని సమన్వయకర్తగా నియమించడం పట్ల కినుక వహించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం హైకమాండ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.

మంత్రిపై తీవ్ర ఆరోపణలు..
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తిరుగుబాటుతో వైసీపీ నాయకత్వానికి షాక్‌ కొట్టినట్లైంది. తనను ఇన్‌చార్జిగా తప్పించడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని అనుమానిస్తున్న ఆదిమూలం.. పెద్దిరెడ్డిపైనా.. ఆయన కుటుంబ సభ్యులపైనా నిప్పులు చెరగడం రాజకీయంగా హీట్‌ పుట్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిదిక్కుగా వ్యవహరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డిపై ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయని ఆరోపణలు చేశారు ఆదిమూలం.

ఇసుక దందా వెనక పెద్దిరెడ్డి..?
సత్యవేడు ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానంలో ఈసారి తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావించింది వైసీపీ నాయకత్వం. అదే సమయంలో ఆదిమూలంను తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. కానీ, ఎమ్మెల్యేగా ఉండటానికే మొగ్గుచూపిన ఆదిమూలం సడన్‌గా ప్లేట్‌ ఫిరాయించారు. అధిష్టానాన్ని ధిక్కరించేలా మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సత్యవేడు నాయకుల ఆత్మీయ సభకు తనను ఆహ్వానించలేదని విరుచుకుపడ్డారు ఆదిమూలం. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఇసుక దందా వెనక పెద్దిరెడ్డి ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Also Read : పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం

అందుకే ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి..
ఐతే ఆదిమూలం వ్యాఖ్యలను తిరుపతి ఎంపీ, సత్యవేడు అసెంబ్లీ సమన్వయకర్త డాక్టర్ గురుమూర్తి ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలానికి ముందుగానే చెప్పే కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు. తనను సత్యవేడు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అనేకసార్లు ఆదిమూలంను కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన ఆసక్తి చూపలేదని గురుమూర్తి చెప్పుకొచ్చారు. ఎక్కడో కమిట్ మెంట్ అయ్యి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రత్యారోపణలు చేశారు గురుమూర్తి.

ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఆదిమూలం వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడో కమిటయ్యారంటే.. ప్రత్యర్థి పార్టీలతో ఆదిమూలం చేతులు కలిపినట్లే భావించాల్సి వస్తుందంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యే కూడా టీడీపీ అధిష్టానంతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. జిల్లాలో ఇంకో రిజర్వు నియోజకవర్గం పూతలపట్టులోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.

Also Read : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

వైసీపీలో ప్రకంపనలు..
ఇప్పుడు సత్యవేడుకు ఆ సెగ తగలడంతో జిల్లా వైసీపీ షేక్‌ అవుతోంది. వైసీపీతో బంధం తెంచుకోడానికి ఆదిమూలం ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారంతో తిరుపతి లోక్‌సభ సమన్వయకర్తగా కొత్త వారిని వెతికే పని ప్రారంభించింది హైకమాండ్‌. ఎంపీని ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్యేను ఎంపీగా పంపడం వల్లే ఈ సమస్య వచ్చిందని.. ఇద్దరినీ యథావిధిగా కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదంటున్నారు వైసీపీ కార్యకర్తలు. మొత్తానికి అటుఇటుగా చేసిన మార్పు ఎమ్మెల్యేలో అసంతృప్తిని రేపినట్లైంది. ఇదే వైసీపీలో ప్రకంపనలకు కారణమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు