అమరావతి : జనసేన, వామపక్షాల మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటికీ ఐదుసార్లు సమావేశమైనా సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. బెజవాడ పశ్చిమ సీటుపై వామపక్షాలు, జనసేన పట్టువీడటం లేదు. పంతానికి పోవడంతో పొత్తులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇరుపార్టీల నేతలు సాయంత్రం మరోసారి భేటీ కానున్నారు. సీపీఐ, సీపీఎం నేతలు ఒంటరిగానే పోటీ చేస్తామని మార్చి 16 శనివారం చెప్పారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు వామపక్షాలు, జనసేన సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. బెజవాడ పశ్చిమ సీటు కోసం సీపీఐ పట్టుబడుతోంది. అయితే ఆ సీటు తమకు కావాలని జనసేన నేతలు కూడా కోరుతున్నారు.
బెజవాడ పశ్చిమ నుంచి సీపీఐ నేతలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తమకు పట్టున్న ప్రాంతం కాబట్టి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అయితే ఈ సీటుపై జనసేనకు కూడా మంచి పట్టుంది. జనసేన నేతలు కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. సీటు ఆశిస్తున్న జనసేన నేతల్లో తీవ్ర పోటీ నెలకొంది. నూజివీడు సీటు కావాలంటే బెజవాడ పశ్చిమ సీటు వదులు కోవాలని జనసేన కార్యకర్తలు అంటున్నారు. దీనికి సీపీఐ కూడా సందిగ్ధంగానే ఉంది. వామపక్షాలు, జనసేన సీట్ల పొత్తులపై ఇవాళా సాయంత్రం 5 గంటలకు మరోసారి సమావేశం కానున్నారు. ఈ భేటీలోనైనా సీట్ల సర్దుబాటు కుదురుతుందో లేదో చూడాలి.