ఏకగ్రీవాలు ఆపండి, ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో కీలక ఆదేశం

sec nimmagadda ramesh kumar unanimous elections : రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పంచాయతీ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు బ్రేక్ పడింది. ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించొద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

ఆ రెండు జిల్లాల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి. దీంతో వాటిని పెండింగ్ లో పెట్టాలని నిమ్మగడ్డ నిర్ణయించారు. తర్వాతి ఆదేశాలు వచ్చే వరకు పెండింగ్ లో పెట్టాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో 112, గుంటూరు జిల్లాలో 61 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవాలు జరిగాయని, నివేదికల పరిశీలన పెండింగ్‌ లో ఉందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు వివరణతో కూడిన నివేదికలు పంపాలని సూచించింది. సర్పంచ్‌ల ఏకగ్రీవాల విషయంలో నివేదికల ప్రకారం తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తామని ఈసీ తెలిపింది.

కాగా, రాష్ట్రంలో తొలి విడతలో 453 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 54, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 46, శ్రీకాకుళం జిల్లాలో 34, పశ్చిమగోదావరి జిల్లాలో 40, విశాఖ జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 28 ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా ఏకగ్రీవాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు