వెయ్యి కోట్లకు పైగా ప్రజాధ‌నం దుర్వినియోగం..! కాగ్ రిపోర్టులో సంచలనం

కాళేశ్వరం ఎత్తిపోతల కోసం విద్యుత్ ఖ‌ర్చులు త‌డిసి మోపెడ‌వుతున్నాయ‌ని అందోళ‌న వ్యక్తం చేసింది. తెలంగాణ‌లో స్థాపిత విద్యుత్‌లో 42 శాతం.. కాళేశ్వరం పంపుల కోస‌మే వినియోగిస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇందుకోసం ఏటా 10 వేల కోట్లు ఖ‌ర్చు అవుతోంద‌ని తెలిపింది.

CAG Audit Report : గత మూడేళ్లకు సంబంధించిన కాగ్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహ‌ణ‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను కాగ్ ఎత్తిచూపింది. ప్రాజెక్టు ల‌క్ష్యాన్ని చేరుకోకపోగా.. ఖ‌జానాపై పెనుభారం మోపిందని ఆక్షేపించిది కాగ్‌. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, ఆస‌రా పింఛన్ల పంపిణీలో అవ‌క‌త‌వ‌క‌లు, దుబారా ఖ‌ర్చులు.. స్థానిక సంస్థలు, రెవెన్యూ ఆదాయం వంటి ఆరు అంశాలపై కాగ్ నివేదిక సమర్పించింది.

గత మూడేళ్ల ఆదాయ వ్యయాలు, ప్రభుత్వ శాఖల పనితీరుపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ – కాగ్‌ ఆడిట్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాబడి తగ్గిపోయిందని.. ఖర్చులు పెరిగిపోయాయని.. ఆదాయం కన్నా అప్పులే ఎక్కవయ్యాయని తన నివేదికలో తేల్చింది కాగ్‌. వచ్చే పదేళ్లలో అప్పులు, వడ్డీలు కలిపి రాష్ట్రం భరించలేనంత భారం అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత మూడేళ్లకు సంబంధించిన ఆడిట్‌ నివేదిక ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించింది అధికార పార్టీ. కాగ్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ద్రవ్యలోటు బాగా పెరిగిపోయిందని, GSDPతో పోలిస్తే అప్పుల నిష్పత్తి 37 శాతం ఎక్కువైందని ఎత్తిచూపింది. FRMB పరిమితిని దాటి దాదాపు 13 శాతం ఎక్కువగా అప్పులు చేసినట్లు ఆక్షేపించింది.

వాస్తవానికి గతంలో కాగ్‌ రిపోర్ట్‌ను బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున ప్రవేశపెట్టేవారు. దీంతో పెద్దగా చ‌ర్చ జ‌రిగేది కాదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కాగ్ రిపోర్ట్‌ను సభ ముందుకు తెచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల‌తో పాటు ఆరు ప్రధాన అంశాలపై కాగ్ రిపోర్ట్‌ను సభ్యులకు అందజేసింది. పన్నులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రానికి 91 వేల 270 కోట్ల రూపాయలు ఆదాయం రాగా, జీతాలు, పెన్షన్లతో సహా ఇతర ఖర్చులు లక్షా 36 వేల 804 కోట్లకు పెరిగిందని తెలియజేసింది.

ఇక విద్య, వైద్యంపై ఖర్చు చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తప్పుబట్టింది కాగ్‌. విద్య కోసం 8 శాతం, వైద్యం కోసం 4 శాతం నిధులను మాత్రమే కేటాయించిందని విమర్శించింది. ఇక రిజర్వు బ్యాంకు నుంచి చేబదులు కిందే 67 వేల కోట్లు తీసుకుందని కాగ్‌ రిపోర్టులో నివేదించారు. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 39 ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయని వివరించింది. 67 ప్రభుత్వ రంగ సంస్థల్లో కేవలం 12 సంస్థలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నట్లు తెలియజేసింది. 32 కార్పొరేషన్లు వాటి పద్దుల రిపోర్టులను సరిగా సమర్పించలేదని ఆక్షేపించింది.

ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ఖ‌ర్చులు త‌క్కువ‌గా, దాని ప్రయోజ‌నాల‌ను పెంచి చూపార‌ని కాగ్ త‌న నివేద‌న‌లో పొందుప‌రిచింది. డీపీఆర్ లో 63 వేల 352 కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మిస్తున్నామ‌ని చెప్పిన‌ప్పటికీ.. దాని అంచ‌నాలు భారీగా పెరిగి ల‌క్ష కోట్లు దాటింద‌ని ఎత్తిచూపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18 ల‌క్షల ఎక‌రాల కొత్త ఆయక‌ట్టు అందుబాటులోకి వ‌స్తుంద‌ని.. గ‌త ప్రభుత్వం చెబితే.. 40 వేల ఎక‌రాల‌ను మించి కొత్త ఆయ‌క‌ట్టు రాలేద‌ని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు కోసం కార్పొరేషన్ ద్వారా భారీగా రుణాలు తీసుకున్నారని కాగ్ తెలిపింది.

ఇక కాళేశ్వరం ఎత్తిపోతల కోసం విద్యుత్ ఖ‌ర్చులు త‌డిసి మోపెడ‌వుతున్నాయ‌ని అందోళ‌న వ్యక్తం చేసింది. తెలంగాణ‌లో స్థాపిత విద్యుత్‌లో 42 శాతం.. కాళేశ్వరం పంపుల కోస‌మే వినియోగిస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇందుకోసం ఏటా 10 వేల కోట్లు ఖ‌ర్చు అవుతోంద‌ని తెలిపింది. కాళేశ్వరం కోసం తీసుకున్న రుణాలు చెల్లించ‌డం కోసం మ‌ళ్లీ అప్పులు చేయాల్సి వ‌స్తుంద‌ని తెలిపింది. కాళేశ్వరం కింద ఎకరాకు 46 వేల రుపాయ‌లు ఖ‌ర్చు అవుతోంద‌ని కాగ్ నివేదించింది.

ఇక ఇసుక తవ్వకాలను కాగ్ త‌ప్పుబ‌ట్టింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇసుక వెలికితీత కాంట్రక్టులు చేతులు మారుతున్నాయ‌ని ప్రస్తావించింది. అనుమతుల‌కు మించి ఇసుక త‌వ్వకాలు జరుపుతున్నారని ఆక్షేపించింది. ఇసుక రీచ్‌ల వ‌ద్ద సీసీ కెమెరాలు, వాహ‌నాల‌కు జీపీఎస్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఇసుక వ్యాపారుల‌ హ‌వా ఎక్కువైందని ఆరోపించింది.

ఆస‌రా పెన్షన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఎత్తిచూపింది. రెండు ల‌క్షల‌కు పైగా అనర్హుల‌కు అస‌రా పింఛన్లు పంపిణీ చేశార‌ని.. త‌ద్వారా వెయ్యి కోట్లకు పైగా ప్రజాధ‌నం దుర్వినియోగం అయ్యింద‌ని కాగ్ నివేదించింది. ఇక స్థానిక సంస్థల్లో గ్రాంట్లను మ‌ళ్లించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు పేర్కొంది. బిల్లుల చెల్లింపులోనూ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని కాగ్ నివేదిక‌లో స్పష్టం చేసింది.

మొత్తం మీద కాళేశ్వరం నుంచి గొర్రెల పంపిణీ ప‌థ‌కం వ‌ర‌కు.. వివిధ రంగాల‌పై కాగ్ తన నివేదిక‌లో గత ప్రభుత్వ పొర‌పాట్లు, లోపాలను ప్రస్తావించింది. అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పిన సమయంలో.. కాళేశ్వరంపై కాగ్‌ లేవనెత్తిన అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడంతో కాగ్‌ నివేదికపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు