Bihar Election Results బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి దూసుకుపోతుంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో NDA కూటమి ముందంజలో కొనసాగుతోంది. అయితే,మహాకూటమితో పోలిస్తే ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. ఏ క్షణమైనా ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి 124 సీట్లలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. 111 స్థానాల్లో మహాకూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇక,పార్టీల పరంగా చూస్తే బీజేపీ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా,జేడీయూ 43స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆర్జేడీ 74స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 20స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తోంది. ఇక,మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న వామపక్షాలు 11స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తున్నారు. బీహార్ లో ఇప్పటివరకు 50శాతం ఓట్ల లెక్కింపు జరిగింది. పూర్తి ఫలితాలు వెలువడడానికి మరింత సమయం పడుతుంది. ఇవాళ అర్థరాత్రి సమయానికి పూర్తి ఫలితాలు వచ్చేస్తాయని బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు.
ఇక, ఈ ఎన్నికల్లో హాసన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ 20వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
బీహార్ లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేజస్వీయాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ తెలిపింది. మేం మా అభ్యర్థులు, అన్ని ప్రాంతాల్లోని కార్యకర్తలను సంప్రదిస్తున్నామని, వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఫలితాలు మాకు అనుకూలంగా ఉన్నాయని ఆర్జేడీ ట్వీట్ చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని పార్టీ తన అభ్యర్థులు, ఏజెంట్లను కోరింది.