జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే : సీఎం పై ప్రశంసల జల్లు

  • Publish Date - December 30, 2019 / 12:55 PM IST

తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే గిరిధర్ రావు కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. శాసనసభలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎం జగన్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సీఎం జగన్ ను కలిసి బయటకువచ్చిన తర్వాత ఎమ్మెల్యే గిరి సీఎంజగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. సీఎం కార్యదీక్ష, పట్టుదల కలిగిన వ్యక్తి అని పొగిడారు. జగన్  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై కూడా ఆయన ప్రసంశలు కురిపించారు. తన నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిశానని… గుంటూరులో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్ధితిని సీఎంకు వివరించాన్నారు. గుంటూరుకు రూ.25 కోట్ల బకాయిలు రిలీజ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై కూడా సీఎంతో చర్చించినట్లు ఆయన చెప్పారు.
 
రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారుతుందని గిరి జోస్యం చెప్పారు. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు గిరి మద్దతు తెలిపారు. పేదలు తమ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవాలనుకుంటున్నారని, ఇంగ్లీష్‌ మీడియం అంశంలో  చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆయన తప్పుబట్టారు. ఉగాదిలోగా  పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

సంక్షేమ పథకాలకు జగన్  పెదపీట వేశారని,  రాజధాని గురించి మాట్లాడేంత పెద్దవాణ్ణి కానని, రాజధానిపై సీఎం జగన్ కు స్పష్టమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఏం చేశారని ఇప్పుడు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాజధానిని  అభివృధ్ది చేసి ఉఁటే ఈ పరిస్ధితి ఉండేది కాదని, ఐదేళ్లలో కేవలం 5500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని రాజధాని పూర్తవ్వాలంటే లక్ష కోట్లు కావాలని గిరి తెలిపారు.