Chandrababu Naidu : సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో కూటమి నేతల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ అయ్యారు. లోక్ సభ సీట్ల ఖరారుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. బీజేపీ, జనసేనకు కేటాయించే సీట్ల సర్దుబాటుపై డిస్కస్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్న అంశంతో పాటు మ్యానిఫెస్టోపైనా చర్చలు జరుపుతున్నారు. బీజేపీ నేత సీఎం రమేశ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఈ సాయంత్రానికి బీజేపీ రెండో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉండటంతో సీట్ల సర్దుబాటుపై స్పీడ్ పెంచింది టీడీపీ.
30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తాము పోటీ చేసే 7 అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది జనసేన. మిగిలిన 23 స్థానాల్లో జనసేన, బీజేపీ ఎవరెక్కడ పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. సీట్ల సర్దుబాటు రేపటిలోగా కొలిక్కి తెచ్చేలా మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
చంద్రబాబు నివాసంలో దాదాపు మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1గంట సమయంలో పవన్ కల్యాణ్ వచ్చారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ ఆఫర్ చేసిన కొన్ని సీట్లపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విశాఖ పార్లమెంట్ స్థానం కోసం బీజేపీ పట్టుబడుతోంది. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ గా భరత్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి స్థానాన్ని తీసుకోవాలని బీజేపీని కోరుతున్నారు చంద్రబాబు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు.
జనసేనాని పవన్ కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాకినాడ లోక్ సభ, పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఓ నిర్ధారణకు పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చ నడుస్తోంది. కైకలూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, మదనపల్లి, కదిరి స్థానాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కైకలూరు, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి, మదనపల్లి అసెంబ్లీ సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది.
Also Read : ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?