అసంతృప్తుల ఆగ్రహ జ్వాల.. టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు, రోడ్డెక్కిన ఆశావహులు

టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. అనకాపల్లి, గజపతినగరం, భీమవరం, తెనాలి సెగ్మెంట్స్ లో టీడీపీ ఆశావహులు హైకమాండ్ పై నిరసన వ్యక్తం చేశారు.

TDP Leaders Protest : ఏపీలో టీడీపీ-జనసేన మధ్య టికెట్ల పంచాయితీ, అసంతృప్తుల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. అనకాపల్లి, గజపతినగరం, భీమవరం, తెనాలి సెగ్మెంట్స్ లో టీడీపీ ఆశావహులు హైకమాండ్ పై నిరసన వ్యక్తం చేశారు.

హైకమాండ్‌కు వార్నింగ్..
అనకాపల్లి సీటును జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. టీడీపీ నేత పీలా గోవింద సత్యనారాయణకు టికెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్ కు వ్యతిరేకంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు గడువు ఇచ్చిన కార్యకర్తలు.. హైకమాండ్ స్పందించకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.

భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం..
ఇక విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీలోనూ అసమ్మతి జ్వాల భగ్గుమంది. హైకమాండ్ తనకు టికెట్ కేటాయించకపోవడంపై నియోజకవర్గ ఇంఛార్జి కేఏ నాయుడు నిరసనకు దిగారు. అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కేఏ నాయుడు నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశమైన నాయుడు గజపతినగరం టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలని విన్నవించారు. అధినేతతో సమావేశం తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం వెల్లడిస్తానని కేఏ నాయుడు తెలిపారు.

ఇక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపుడి శివ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉండి నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు కొత్త నాగేంద్రబాబును కలవపూడి శివ ఆఫీసు నుంచి ఆయన అనుచరులు పంపేశారు. కలవపుడి శివ ఉండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు శివపై ఒత్తిడి తెస్తున్నారు.

కలవపూడి శివ హాట్ కామెంట్స్..
టీడీపీ బలోపేతం కోసం కష్టపడితే నన్ను అవమానించారు. కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఉండి సీటు నాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో అధిష్టానమే చెప్పాలి. సమాచారం ఇవ్వకుండా టికెట్ ప్రకటన చేశారు. నా బలం ఏంటో ప్రజాక్షేత్రంలో చూపిస్తా. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగబోతున్నా.

ఇక, ఉమ్మడి అనంతపురం జిల్లాలో టికెట్ దక్కని నేతలు ఆందోళనకు దిగారు. సీనియర్ నేతలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. దీంతో అధిష్టానం బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టింది. రెండో జాబితాలో చాన్స్ ఉంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

 

ట్రెండింగ్ వార్తలు