Telangana cabinet : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించింది. రిజిస్ట్రేషన్ చట్టం స్వల్ప సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టం పలు సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 4 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో మంత్రిమండలి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
ఆన్ లైన్ లో ఆస్తుల నమోదు కార్యక్రమం గడువు పొడిగించింది. అక్టోబర్ 20 వరకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ విధానంపై కేబినెట్ చర్చించింది. నాలా చట్ట సవరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగంపై సమగ్రంగా కేబినెట్ చర్చించింది.
ఈసారి కూడా గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేసేందుకు నిర్ణయించింది. రాబోయే సీజన్‌లో రాష్ట్రంలో సాగుచేయబోయే మొక్కజొన్న అంశంపై క్యాబినెట్ చర్చించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పించింది.
భూమార్పిడి సులభతరం చేస్తూ చట్ట సవరణకు మంత్రి మండలి నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్దత కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టం 1955 సవరణ చేసింది. వార్డు కమిటీల పనివిధానానికి సంబంధించి, వార్డుల రిజర్వేషన్ సంబంధించిన అంశంలో చట్ట సవరణలు చేసింది.