అన్ని షాపులు తెరుచుకుంటున్నాయి

  • Publish Date - May 18, 2020 / 02:32 PM IST

తెలంగాణ రాష్ట్రంలో  మంగళవారం  నుంచి అన్నీ వ్యాపార సంస్ధలు తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ 4 సడలింపులపై ప్రగతి భవన్ లో నిర్వహించిన  కేబినెట్ బేటీలో సోమవారం సుదీర్ఘంగా  చర్చించారు.హైదరాబాద్  నగరంలో మినహా రాష్ట్రంలోని  అన్ని ప్రాంతాల్లో వ్యాపార సంస్ధలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో రోజు విడిచి రోజు షాపులు తెరుచుకోవచ్చని వీటికి సంబంధించిన వివరాలను జీహెచ్ ఎంసీ కమీషనర్ నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన వాటిని గ్రీన్ జోన్లుగా సీఎం కేసీఆర్  ప్రకటించారు.  మే 31 వరకు  రాష్ట్రంలో లాక్  డౌన్ పొడిగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.  కంటైన్మెంట్ ఏరియాలో 1452 కుటుంబాలు ఉన్నాయని… వీటిని హాట్ స్పాట్ లుగా గుర్తించారు. వీరికి అవసరమైన అన్నీ ప్రభుత్వమే డోర్  డెలివరీ చేస్తుందని సీఎం చెప్పారు. అందరి క్షేమాన్ని కాంక్షించి వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు మందు త్వరలో వచ్చే పరిస్ధితి లేదు కనుక…..ఇలాంటి పరిస్ధితిలో కరోనాతో కలిసి జీవించటం నేర్చుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతకు సాగించాలని ఆయన సూచించారు. 

మరోవైపు మంగళవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని కేసీఆర్ అన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.  హైదరాబాద్ పరిధిలో సిటీబస్సులు నడవవని… నగరంలో ఆటోలు, టాక్సీలు నడుపుకోవచ్చని ఆయన చెప్పారు. ఆటోలు డ్రైవర్ తో పాటు ముగ్గురు… ట్యాక్సీలో డ్రైవర్తో సహా నలుగురు ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు.  మెట్రో  రైలు సర్వీసులు కూడా పని చేయవనికేసీఆర్ తెలిపారు. 

సెలూన్లు తెరుచుకోవచ్చని… ఈ కామర్స్ …. ప్రభుత్వ కార్యాలయాలు… ప్రయివేటు కార్యాలయాలు  కోవిడ్  నిబంధనలు పాటిస్తూ పూర్తిస్ధాయిలో పనిచేసుకోవచ్చని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో   మే 31 వరకు కర్ఫ్యూ యధాతధంగా కొనసాగుతుందని ఆయన  వివరించారు. అన్ని మతాల  ప్రార్ధనా మందిరాలు మూసి వేసి ఉంచాలని ఆయన అన్నారు. సినిమా హాళ్ళు, విద్యాసంస్ధలు మే 31 వరకు మూసి ఉంచాలని చెప్పారు. 

ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పని సరిగాధరించాలని, మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారని  ఆయన హెచ్చరించారు. పరిశ్రమలు, కంపెనీలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం త్వరలో కరోనా మహమ్మారి నుంచి బయట పడుతుందనే ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు.