గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్

వారి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. యధావిధి స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Governor Quota MLCs

Governor Quota MLCs : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది తెలంగాణ హైకోర్టు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది హైకోర్టు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్టేటస్ కో ఆర్డర్ పాస్ చేసింది కోర్టు. గత ప్రభుత్వం హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసింది. అయితే, నాటి కేసీఆర్ ప్రభుత్వ సిఫార్సులను తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉన్న దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ.. హైకోర్టును ఆశ్రయించారు.

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. అయితే, తమ కేసు తేలే వరకు గవర్నర్ కోటాలో కొత్తగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.

Also Read : తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎంపీ బరిలో సోనియా గాంధీ..!

వారి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. యధావిధి స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడినట్లు అయ్యింది.

Also Read : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!