Telangana BRS MLAs : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!

Telangana BRS MLAs : గులాబీ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలంటే.. నియోజకవర్గాల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్‌రెడ్డి స్వయంగా పావులు కదుపుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Telangana BRS MLAs : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!

BRS MLAs meet Telangana CM Revanth Reddy amid switchover buzz

Telangana BRS MLAs : తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు కొత్త టెన్షన్‌ మొదలైంది. ఓవైపు సీఎం రేవంత్‌రెడ్డి గులాబీ పార్టీపై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తుండటం.. మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తరచూ ముఖ్యమంత్రితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా.. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కావడం గులాబీ వర్గాల్లో గుబులు రేపుతోంది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఫోకస్‌ :
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు దఫాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అయితే.. 2014, 2018 ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ అనుసరించిన విధానాలనే.. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కూడా అనుసరిస్తారా అన్న చర్చ సాగుతోంది.

Read Also : BRS MLA KTR : కాంగ్రెస్, బీజేపీ సంబంధం గురించి ప్రజలకు చెప్పండి.. కరెంట్ బిల్లులన్నీ కోమటిరెడ్డికి పంపించండి

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఫోకస్‌ పెట్టిందన్న ప్రచారం నడుస్తోంది. గులాబీ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలంటే.. నియోజకవర్గాల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్‌రెడ్డి స్వయంగా పావులు కదుపుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం :
కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలుసుకున్నారు. అయితే.. వారంతా కాంగ్రెస్‌లో చేరుతారన్న చర్చ జోరందుకోవడంతో.. కేవలం నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించేందుకే కలిశామని వివరణ ఇచ్చుకున్నారు. అంతకుముందే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఓ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌.. స్వామిగౌడ్‌తో పాటు ప్రకాశ్‌గౌడ్‌ ఇంటికి కూడా వెళ్లి భేటీ అయ్యారు. దీంతో వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది.

రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ:
రెండ్రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల ముందే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినా.. అది సాధ్యం కాలేదు. తాజా భేటీతో కృష్ణారెడ్డి హస్తం పార్టీలో చేరిపోనున్నారనే వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉండగా.. ఆదివారం రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రకాశ్‌గౌడ్‌ కూడా నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి మాత్రమే సీఎంను కలిశానని.. పార్టీ మారే ఆలోచన తనకు లేదని ప్రకటించారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అవిశ్వాసాలతో మున్సిపాలిటీలు హస్తగతం కావడం.. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతల వరుస భేటీలతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

Read Also : BRS Chief KCR : రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. అభ్యర్థుల విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా?