5 నెలల్లోనే క్లోజ్ : జనసేన ఆఫీస్ కి TOLET బోర్డు

  • Publish Date - August 26, 2019 / 01:49 PM IST

ఏపీలో మరో జనసేన ఆఫీస్ క్లోజ్ అయ్యింది. జనసేన నేతలు ఆఫీస్ భవనాన్ని ఖాళీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ ఆఫీస్ కి టులెట్ బోర్డు పడింది. ప్రత్తిపాడులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో జనసేన ఆఫీస్ ఉంది. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసి భవన యజమానికి తాళాలు అప్పగించేశారు జనసేన నేతలు. దీంతో ఆ భవనం ముందు టులెట్ బోర్డు పెట్టారు ఓనర్. ఆఫీస్ లేదా బార్ అండ్ రెస్టారెంట్‌కు రెంట్ కి ఇస్తానని బ్యానర్ కూడా తగిలించేశారు. 2019 మార్చిలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన.. కేవలం 5 నెలల్లోనే ఖాళీ చేసింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పలువురు నాయకులు జనసేనని వీడారు. దీంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు సైతం మూతపడిపోతున్నాయి.

మాజీమంత్రి రావెల కిషోర్ బాబు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరడంతో ప్రత్తిపాడులోని జనసేన ఆఫీస్ బోసిపోయింది. నిర్వహణ బాధ్యతలు ఎవరూ తీసుకోకపోవడంతో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు రావెల కిషోర్ బాబు. రావెల కిషోర్ బాబుకు ప్రత్తిపాడు టికెట్ కన్ఫమ్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. దాంతో రావెల కిషోర్ బాబు గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో జనసేన పార్టీ ఆఫీస్ ని ఏర్పాటు చేశారు. ఫలితాల తర్వాత రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరడంతో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు కార్యకర్తలు. 

కాగా, పార్టీ లోగోలు కానీ పార్టీ అధినేత చిత్రాలను గానీ తొలగించకుండానే యజమానికి భవనాన్ని తిరిగి అప్పగించారు జనసేన నేతలు. భవన యజమాని వాటిని తొలగించకుండానే టులెట్‌ బోర్డు ఏర్పాటు చేయడం విశేషం. పవన్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మద్దతుగా ప్రచారం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఘోర ఫలితాలను చూశారు. పార్లమెంటు బరిలో ఖాతా కూడా తెరవలేకపోయిన జనసేన.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటు దక్కించుకోగలిగింది. ఇక జనసేనాని పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు.

ట్రెండింగ్ వార్తలు