గులాబీ పార్టీలో రెబల్స్ వేడి పుట్టిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి రెబల్స్‌ను రంగం నుంచి తప్పించాలని పావులు కదిపినా కొన్ని చోట్ల వారి బెడద ఎదుర్కోక తప్పలేదు. ఇక ఫలితాలు వెలువడనుండడంతో రెబల్స్ వ్యవహారం పార్టీకి కలిసి వస్తుందా? నష్టం చేకూరుస్తుందా అంచనాల్లో అధికార పార్టీ నేతలు మునిగిపోయారట. సాధారణంగా ఏదైనా పార్టీకి ప్రత్యర్థులతో భయం ఉంటుంది.
కానీ తెలంగాణలో మాత్రం అధికార పార్టీలోని రెబల్స్, కోవర్టులతోనే గుబులు ఎక్కువైంది. పార్టీకి అందిన నివేదికలతో పాటు ప్రైవేటు ఏజెన్సీలు ఇచ్చిన నివేదికలు, ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారాన్ని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేష్ల నుంచి వచ్చిన సమాచారాన్ని మున్సిపాల్టీల వారిగా సమీక్షిస్తున్న నేతలు.. రెబల్స్ పోటీలో ఉన్న స్థానాలతో పాటు వివక్ష పార్టీలు గట్టిగా పోటీ ఇస్తున్న మున్సిపాలిటీల జాబితాను సిద్ధం చేసుకున్నారట.
అక్కడే రెబల్స్ సమస్య :
పార్టీలోకి వలసలు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో రెబల్స్ సమస్య ఎక్కువగా ఉంది. కొల్లాపూర్, అయిజ, ఆమనగల్, ఇల్లందు, ఎల్లారెడ్డి లాంటి మున్సిపాలిటీల్లో మాజీలు తమ వర్గానికి చెందిన నేతలను అన్ని వార్డుల్లో రంగంలోకి దించి అధికార పార్టీ అభ్యర్థులకు దీటుగా పోటీ ఇచ్చారన్న నివేదికలు పార్టీకి అందాయట.
ఈ మున్సిపాలిటీల్లో రెబల్స్‌తో అధికార పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడం లేదంట. పోలింగ్ పూర్తయిన అనంతరం పోలింగ్ సరళిపై రెబల్ నేతలు సమీక్షలు నిర్వహించుకున్నారు. తాము కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. మరోపక్క పార్టీ నేతలు కూడా ఫలితాలపై అంతే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెబల్స్ విజయం సాధిస్తే…
అధికార పార్టీకి ఎదురొడ్డి నిలిచినట్లే అవుతుంది. కానీ పార్టీకి మాత్రం నష్టం జరుగుతుంది. విజయం సాధించిన నేతలు మళ్లీ కారెక్కినా… పార్టీ పరంగా మాత్రం ఆ ప్రాంతాల్లో పట్టు కోల్పోయినట్లు సంకేతాలు వచ్చినట్లే అన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది.
రెబల్స్‌తో పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగి, ఇతర పార్టీలకు చెందిన నేతలు విజయం సాధిస్తే మరిన్ని ఇబ్బందులు తెరపైకి వచ్చే ప్రమాదం ఉందని అధికార పార్టీ నేతలు అనుకుంటున్నారు. రెబల్స్‌తో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో కోవర్టు అభ్యర్థులు రంగంలో ఉన్నారన్న సమచారం పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ మున్సిపాలిటీల్లో రెబల్స్, కోవర్టుల ప్రభావం ఎలా ఉటుందో అన్న చర్చ గులాబీ దళంలో మొదలైంది.
ఓటర్లు ఎవరికి పట్టం కడతారో? :
ఆధిపత్య పోరు కొనసాగుతున్న నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడుతారా అన్న అసక్తి మాత్రం అందరిలోనూ నెలకొంది. కొత్తగా ఏర్పడిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు తెలుస్తోంది.
రాజకీయంగా ఒకరిని ఒకరు దెబ్బతీసుకునే ప్రయత్నాలు చేసినట్లు .. కొన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా మెసేజీల ద్వారా సమాచారం పంపి ఓడించే పని చేశారని టీఆర్‌ఎస్ నాయకులే చర్చించుకుంటున్నారు. రాజకీయంగా అడ్డు తప్పించుకునేందుకే కొందరు నాయకులు ప్రయత్నించారని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇలా చాలా చోట్ల కోవర్ట్ రాజకీయాలు జరిగాయంటున్నారు.