ఆర్టీసీ సమ్మె రికార్డు..51 రోజులు నాటౌట్

  • Publish Date - November 24, 2019 / 02:29 AM IST

తెలంగాణ ఆర్టీసీ సమ్మె..కొన్ని రోజులుగా హాట్ టాపిక్. తెలంగాణ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద సమ్మె ఇదే. 51 రోజులకు చేరుకుని నాట్ ఔట్ అంటోంది. 49 వేల 300 మంది కార్మికులతో ముడిపడిన వ్యవహారం కావడంతో పార్లమెంట్‌లో కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. కొలిక్కి వచ్చినా ముగింపు దొరకడం లేదు. ప్రస్తుతం బంతి ప్రభుత్వం చేతిలో ఉంది. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. దసరా పండుగ ఉండగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దశల వారీగా ఆందోళనలు చేస్తూ వచ్చిన ఆర్టీసీ జేఏసీ కొంత పట్టు సడలించింది. ఓ మెట్టు దిగింది. మూడు పర్యాయాలు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించినా..అప్పుడు కార్మికులు మెట్టు దిగలేదు. 

షరతులు లేకుండా తమను విధుల్లో చేర్చుకోవాలని కార్మికులు చెబుతున్నా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోలేదు. అనూహ్యంగా ఈ కేసు కార్మిక శాఖ పరిధిలోకి వచ్చి చేరింది. సమ్మె చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా అని తేల్చాల్సింది కార్మిక న్యాయస్థానమే అని హైకోర్టు ఐదు రోజుల క్రితం తేల్చిచెప్పింది. దీంతో కేసు హైకోర్టు నుంచి కార్మిక శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది తేలే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో కార్మికుల్లో పునరాలోచన మొదలైంది. ఆర్టీసీ సమ్మె..ప్రభుత్వ వైఖరితో చాలా మంది తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కొంతమంది బలవన్మరణానికి పాల్పడగా..మరికొంతమంది గుండెపోటుతో చనిపోయారు. 

ఇదిలా ఉంటే..తెలంగాణ ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటుకు చోటు దక్కబోతోంది. సగం ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చే ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో తొలిసారి ప్రైవేటు స్టేజీ క్యారియర్ పర్మిట్లతో బస్సులతో తిరిగేందుకు రంగం సిద్ధమైంది. 
Read More : బయో డైవర్సిటీ..స్పీడ్‌ థ్రిల్స్‌..బట్‌ కిల్స్‌ : 6 రోజులు..550 ఓవర్ స్పీడు చలాన్లు