సమాచార కమీషనర్ల నియామకం ఆపండి:  విజయసాయి రెడ్డి 

  • Publish Date - May 11, 2019 / 03:02 AM IST

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ లో సమాచార కమీషనర్ల నియామకాన్ని నిలిపి వేయాలని వైసీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి  ఏపీ సీఎస్ కు, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖలు  రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార కమీషనర్లుగా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. సమచార కమీషనర్ల నియామకంలో పారదర్శకత లోపించిందని ఆయన ఆరోపించారు. 

విజయసాయి రెడ్డి రాసిన లేఖలో…” ఆర్టీఐ చట్టం (2005) సెక్షన్‌ 15 ప్రకారం నియామకాలన్నీ సమాచార కమిషన్‌ నిబంధనావళి ప్రకారమే జరగాలి.  కానీ సమాచార కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. వారిలో ఒకరు విజయవాడకు చెందిన హోటల్‌ వ్యాపారి ఐలాపురం రాజా కాగా మరొకరు విద్యా శాఖ మంత్రి ప్రైవేట్‌ కార్యదర్శి, గ్రామాధికారుల సంఘం నాయకుడైన ఇ.శ్రీరామమూర్తి. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు. ఐలాపురం రాజా వ్యాపారం రంగంలో ఉన్నారు. ఆయన పేరుకు గవర్నర్  ఆమోదం ఇచ్నినట్లు, ఇ. శ్రీరామ్మూర్తి పేరుకు గవర్నర్  అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ప్రతిపక్ష నాయకుడు సమవేశానికి రానప్పుడు కమిటీ వీరి పేర్లకు ఎలా అనుమతిచ్చిందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 

చట్టంలోని 5వ సబ్‌సెక్షన్‌ ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యే వ్యక్తులు ప్రజా జీవనంలో ప్రముఖులై ఉండాలి. న్యాయ, శాస్త్ర, సాంకేతిక, సేవా,  మేనేజ్ మెంట్  జర్నలిజం, మాస్‌ మీడియా, ప్రభుత్వ, పరిపాలనా రంగాలలో విస్తృత పరిజ్ఞానం, అనుభవజ్ఞులై ఉండాలని చట్టం చెబుతోంది.” అని విజయసాయి రెడ్డి రాసిన లేఖలో పేర్కోన్నారు. అంతేకాక ….సబ్‌ సెక్షన్‌–6 ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు ఎంపీలుగా లేదా ఎమ్మెల్యేలుగా ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండకూడదు. లాభసాటి పదవులు నిర్వహించి ఉండకూడదు. ఏదైనా వ్యాపారంలో ఉండకూడదని 6వ సబ్‌ సెక్షన్‌ స్పష్టం చేస్తోంది. పై నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఇద్దరూ సమాచార కమిషనర్లుగా అనర్హులు అని విజయసాయి రెడ్డి వివరించారు.  ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో ఉండి, సమావేశాలకు రాలేరని తెలిసి కూడా  కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారం  రాజకీయ దురుద్దేశపూర్వకంగాజరిగిందని ఆయన ఆరోపిస్తూ ….కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఈ నియామకాలను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి సాధ్యమైనంత త్వరలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’  అని లేఖలో  కోరారు.