జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా ఉన్న గణబాబు తన తండ్రి, మాజీ ఎంపీ తెలుగుదేశం నాయకుడు పెతకంసెట్టి అప్పలనరసింహం మరణంతో అకస్మాత్తుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పెందుర్తి స్థానం నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2019లో టీడీపీ నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం జిల్లాలో అంతటా గట్టిగా వీచినప్పటికీ టీడీపీ గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో గణబాబు ఒకరు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించడంతో పాటుగా నిత్యం ప్రజలలో ఉండటం గణబాబు స్టైల్. స్వతహాగా క్రీడాకారుడు అయిన గణబాబు.. టీడీపీ మహానాడు విశాఖలో జరిగినప్పుడు వాలంటరీ టీంను గైడ్ చేస్తూ అంతా తానై వ్యవహరించారు కూడా.
ఇటీవల ప్రమాదం జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఉన్న వెంకటాపురం కూడా విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే గణబాబు తన కార్యకర్తలతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ రావడంతో పాటు చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.
దీంతో తెలుగుదేశం నేతలు ఎలాంటి ఆందోళనలు నిర్వహించేందుకు వీల్లేకుండా పోయింది. ఎల్జీ పాలిమర్స్‌ను తరలించాలని బండారు సత్యనారాయణ
వంటి నేతలు హడావుడి చెసినా అంత స్పందన రాలేదు. ఇదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖ వస్తానని, బాధితులను పరామర్శిస్తానని చెప్పారు. కానీ రాలేకపోయారు. ఆ పార్టీ నుంచి మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల పరిహారం మాత్రం అందజేశారు.
వైసీపీ ఆరోపణలకు అదే బలం :
ఈ సంఘటన జరిగిన 15 రోజుల లోపు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినప్పుడు మాత్రం నారా లోకేశ్ విజయవాడ నుంచి రోడ్ మార్గం ద్వారా వచ్చారు. 13 మంది సామాన్యులు మరణించినా చంద్రబాబు కానీ టీడీపీ అధిష్టానం కానీ బాధితులను పరామర్శించడానికి రాలేదు కానీ అచ్చెన్న అరెస్టయినప్పుడు రావడం.
అది కూడా తన నియోజకవర్గం మీదుగా వెళుతూ కనీసం ఆగకపోవడం గణబాబును మనస్తాపానికి గురి చేసిందని ఆయన అనుచరులు అంటున్నారు. దీనివల్ల టీడీపీ అధిష్టానానికి ప్రజల కంటే కేసుల్లో ఇరుక్కున్న వారంటేనే ఎక్కువ ఇష్టం అని వైసీపీ ఆరోపణలకు బలం చేకూరిందని చెబుతున్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీలో అంతర్భాగం. ఒక వేళ నారా లోకేశ్ కానీ, అధినేత చంద్రబాబు కానీ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించి నట్లయితే మరింత మేలు జరిగేదని, ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారని అంటున్నారు.
అప్పటి నుంచి గణబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినా, నిత్యం ప్రజలతో ఉంటున్నా ప్రయోజనం లేకుండా పోతోందని గణబాబు ఫీలవుతున్నారట. అందుకే ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కూడా కాస్తా దూరంగా ఉంటున్నారు.