భీమిలి నియోజకవర్గం.. గురు శిష్యుల మధ్య వివాదం రేపింది. భీమిలీ నియోజకవర్గం ఎవరి పరం కానుంది.
విశాఖ : భీమిలి నియోజకవర్గం.. గురు శిష్యుల మధ్య వివాదం రేపింది. అధిష్టానం కూడా గురువుకే పట్టం కట్టడంతో .. శిష్యుడు గురువుపై పోటీకి సై అంటున్నాడు. అసలు గురు శిష్యుల మధ్య వివాదం ఎలా మొదలైంది.. ఎప్పుడూ ఓటమెరగని గురువుకు .. ఇప్పుడు సరైన ప్రత్యర్ధి దోరికాడా..? ఈసారి ఎన్నికలు యుద్ధాన్ని తలపించనున్నాయా.. అసలు భీమిలీ నియోజకవర్గం ఎవరి పరం కానుంది.
అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు.. ఇద్దరూ మంచి మిత్రులు. అంతకు మించి గురు శిష్యులు. విద్యాసంస్థలను చూసుకుంటున్న అవంతి శ్రీనివాసరావును ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి పోటీ చెయించింది గంటా శ్రీనివాసరావే. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం అనంతరం.. అవంతి, గంటా ఇద్దరూ టీడీపీ తీర్ధం తీసుకున్నారు. గురువు గంటా శ్రీనివాసరావు కోసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిని వదిలి.. అనకాపల్లి ఎంపీగా అవంతి శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా అవంతికి మొదటి నుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని బలంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో 2014లో పార్లమెంట్‌కు వెళ్లారు. 2019లో తాను భీమిలి నుంచి తిరిగి పోటీ చెస్తానని ఆయన సన్నిహితులతో అనేక సార్లు చెప్పారు కూడా. ముఖ్యంగా అవంతి విద్యా సంస్థలు అక్కడే ఉండటం.. తాను ఇంతకు ముందు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం.. గతంలో చేసిన అభివృద్ది …అన్నింటికి మించి తన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండటంతో .. అవంతి బీమిలి నుంచే పోటీ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.
గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి హోదాలో ఆయన అనేక పనులు చేశారు. గంటా కూడా భీమిలి నుంచే పోటీ చేయాలనే అలోచనలో ఉన్నారు. అయితే గతంలో ప్రాతినిధ్యం వహించిన భీమిలి నుంచి పోటీ చేస్తానని అవంతి తెలుగుదేశం అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో అవంతిపై గంటా అలక బూనారు కూడా. జిల్లా ఇంచార్జి మంత్రి చిన్నరాజప్ప రాయబారం చేశారు. అయితే అధిష్టానం గంటాకే తిరిగి సీటు ఇస్తానని తేల్చి చెప్పింది. దీంతో సమయం కోసం వేచి చూసిన అవంతి.. పార్టీ మారైనా భీమిలి నుంచే పోటీ చేయాలని డిసైడయ్యారు.
ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు అఫీషయల్‌గా టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు భీమిలి టిక్కెట్ కన్ఫామ్ చేశారని సమాచారం. ఇప్పటికీ వైసీపీకి భీమిలిలో సరైన నేత లేరు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిపై 40 వేల ఓట్ల మేజారిటీతో విజయం సాధించారు గంటా. సరైన ప్రత్యర్ధి లేకపోవడంతో ఈసారి కూడా 80 వేలకు పైగా మేజారిటీ సాధిస్తానని గంటా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా .. భీమిలిలో నివాసం ఉండేదీ తక్కువ. ఇంచార్జిలతోనే కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. ఇదే సమయంలో తన శిష్యుడు.. తనకే ఎదురు తిరగడం గంటా క్యాంపును కలవరపరుస్తోంది. గంటా భీమిలి నుంచే టీడీపీ తరుపున పోటీకి దిగితే మాత్రం గురుశిష్యులు మధ్య భారీ సమరం సాగే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read : ఎన్నికల వేళ : పార్టీలకు జంప్ జిలానీల టెన్షన్
Also Read : ఆపరేషన్ ఆకర్శ్ : వైసీపీలోకి వలసల జోరు?