Anam Ramanarayana Reddy
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? తొలుత ఆత్మకూరు నేతలతో టచ్‌లోకి వెళ్లిన ఆనం.. సడన్‌గా మనసు మార్చుకున్నారా? తన సిట్టింగ్ స్థానం వెంకటగిరి నుంచే పోటీ చేయడమే బెటర్ అని భావిస్తున్నారా? గతంలో ఆనం ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరుపై వెనకడుగు వేయడానికి కారణమేంటి?
నెల్లూరు జిల్లాలో టీడీపీ క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వెంకటగిరి ఒకటి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో YCP నుంచి గెలిచిన ఆనం.. ఏడాది క్రితం ఆ పార్టీతో విభేదించి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కురుగొండ్ల రామకృష్ణ ఇప్పటికీ టీడీపీకి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆనం టీడీపీలో చేరినా.. ఈసారి వెంకటగిరి టికెట్ తనకే వస్తుందని నిన్నమొన్నటివరకు ధీమాగా ఉన్నారు రామకృష్ణ. ఐతే ఇటీవల జరిగిన చంద్రబాబు బహిరంగ సభ ‘రా కదలిరా’ కార్యక్రమంతో వెంకటగిరి తెలుగుదేశంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెబుతుండటంతో రాజకీయం రసకందాయంగా మారింది.
Also Read : వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?
ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం.. టీడీపీలో చేరికకు ముందు ఆత్మకూరు సీటును ఆశించినట్లు ప్రచారం జరిగింది. దీంతో వెంకటగిరి ఇన్‌చార్జి రామకృష్ణ కూడా ఆనం రాకను స్వాగతించారు. ఆనం కూడా ఇటీవల కొద్ది రోజుల వరకు ఆత్మకూరు నేతలతో టచ్‌లో ఉంటూ ఆ నియోజకవర్గంపై వ్యూహాలు రచించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆనం.. ఆత్మకూరు నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
ఐతే వైసీపీలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ మేకపాటి కుటుంబం ప్రాతినిధ్యం వహించడంతో గత ఎన్నికల్లో వెంకటగిరికి మారారు ఆనం. ప్రస్తుతం ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఇదే సమయంలో టీడీపీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాను ఆత్మకూరులో పోటీ చేయడం కన్నా, సిట్టింగ్ స్థానం వెంకటగిరి నుంచే మళ్లీ పోటీ చేయాలని ఆనం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : వైఎస్ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?
ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఆనం మళ్లీ వెంకటగిరి నుంచే రంగంలోకి దిగనున్నారనే సంకేతాలిస్తున్నాయి. ఇటీవల వెంకటగిరిలో జరిగిన చంద్రబాబు’ రా కదలిరా’ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేరును ప్రస్తావించిన చంద్రబాబు.. పరోక్షంగా ఆనమే వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థి అని ఇండికేషన్ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా వెంకటగిరి టీడీపీ టికెట్ తనదేనన్నట్లు వ్యాఖ్యలు చేయడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఒకవేళ ఆనం రామనారాయణరెడ్డే వెంకటగిరి టీడీపీ అభ్యర్థి అయితే, ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న రామకృష్ణ పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా పార్టీ పటిష్టతకు పనిచేసిన రామకృష్ణ.. చివరి నిమిషంలో టికెట్ వదులుకుంటారా? ఆనంకు సహకరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఆనం యూటర్న్ తీసుకోవడంతో వెంకటగిరి రాజకీయం ఆసక్తికరంగా మారింది.
Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?