Ajit pawar, Sharad pawar and Supriya sule
Maharashtra Politics: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ నిర్ణయం మీద పార్టీ వర్గాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో దీనిపై ఆలోచిస్తానంటూ రాజీనామా ప్రకటన వచ్చిన కొద్ది గంటల అనంతరం మరో ప్రకటన చేశారు శరద్ పవార్. శరద్ పవార్ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదంటే ప్రకటించినట్లుగానే తప్పుకుంటారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీకి బాస్ ఎవరనే చర్చ అప్పుడే మొదలైంది. రాజీనామా ప్రకటనతోనే తదుపరి అధ్యక్షుడికి కమిటీని నియమించబోతున్నట్లు, ఆ కమిటీయే అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని పవార్ మంగళవారం ప్రకటించారు. దీంతో చర్చ మరింత వాడీ వేడి మీద కొనసాగుతోంది. అయితే అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నరు. ఒకరు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కాగా, మరొకరు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్. ఇక వీరిద్దరే కాకుండా ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సైతం రేసులో కనిపిస్తున్నారు.
ఇక వీరే కాకుండా ప్రఫుల్ పటేల్, సునీల్ తడ్కరే, కేకే శర్మ, పీసీ చాకో, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేష్ తోపే, జితేంద్ర అహ్వాద్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, జయదేవ్ గైక్‌వాడ్ వంటి పేర్లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 15 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీయే కాబోయే అధ్యక్షుడిని నిర్ణయిస్తుందని పవార్ ప్రకటించారు. అయితే ఈ కమిటీ పవార్ కనుసన్నల్లోనే పని చేస్తుంది కాబట్టి.. పవార్ కోరుకున్న వ్యక్తే తదుపరి అధ్యక్షుడు అవుతారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవార్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది అసలు ప్రశ్న.
Bajrang Dal: మేం కూడా బ్యాన్ చేస్తాం.. బజరంగ్ దళ్ సంస్థకు ఛత్తీస్‌గఢ్ సీఎం వార్నింగ్
శరద్ పవార్, సుప్రియా సూలే ముంబైలోని ఎన్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ప్రఫుల్ పటేల్ కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఎన్సీపీ కమిటీ సమావేశం ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు అజిత్ పవార్ ఇంటి వద్ద ఎన్సీపీ నేతలు గుమిగూడారు. ఆయనను కలిసేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. శరద్ పవార్‌ను కలిసిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌ను కలిసేందుకు వెళ్లారు. ప్రస్తుతం ఎన్సీపీకి 9 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఐదుగురు లోక్‌సభ సభ్యులు కాగా నలుగురు మంది రాజ్యసభ సభ్యులు. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో 54, కేరళలో 2, గుజరాత్‌లో 1 ఎమ్మెల్యేలు ఉన్నారు.