Maharashtra Politics: 27 ఏళ్లకు ఎమ్మెల్యే, 38 ఏళ్లకే సీఎం.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శరద్ పవార్ రాజకీయ జర్నీ ఎలా సాగిందంటే?

గ్రామీణ నేపథ్యం నుంచి రావడం, గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం మీద పట్టు ఉండడంతో ఈ శాఖ ఆయనకు బాగా సహాయపడింది. ఆ సమయంలో భారతదేశం ఆహారధాన్యాలలో మిగులును సాధించడంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత శరద్ పవార్‭దే

Maharashtra Politics: 27 ఏళ్లకు ఎమ్మెల్యే, 38 ఏళ్లకే సీఎం.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శరద్ పవార్ రాజకీయ జర్నీ ఎలా సాగిందంటే?

Sharad Pawar

Maharashtra Politics: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ (Sharad Pawar) మంగళవారం ప్రకటించారు. 1999 జూన్ 10న పార్టీని స్థాపించినప్పటికీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన 24 ఏళ్ల అనంతరం 2023 మే 2వ తేదీని తన రాజీనామాను ప్రకటించారు. కొన్ని విమర్శలు, ఎత్తు-పల్లాలు ఉన్నప్పటికీ 63 ఏళ్ల పాటు సాగిన రాజకీయ జీవితం ఆచరణాత్మక రాజకీయాలకు నిదర్శనం. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే రాజకీయాలతో పాటే సామాజిక కార్యకలాపాల్ని కొనసాగిస్తానని చెప్పిన ఆయన.. ఎప్పుడూ వెనకడుగు వేయకుండా, మాట మీద నిలబడ్డారు. రాజకీయ ఎత్తుగడల్లోనే కాదు, రాజకీయాల్ని ఎప్పుడు ఆపాలో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే తన రాజీనామాను ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ
పవార్ పూర్తి పేరు శరద్ గోవిందరావు పవార్ (Sharad Govindrao Pawar). ప్రస్తుతం ఆయన వయసు 82. పూణెకు సమీపంలోని బారామతి (Baramati)లో ఆయన జన్మించారు. పూణేలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరిన ఆయన.. కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే (1968) బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1990 వరకు అదే స్థానం నుంచి నిరాటక విజయ పరంపర కొనసాగించారు. అప్పట్లో పిన్న వయస్క ఎమ్మెల్యేల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

అతి పిన్న వయస్కుడైన సీఎంగా రికార్డ్
ఇక ముఖ్యమంత్రి (Chief Minister) కూడా అలాగే అయ్యారు. 1978లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 38 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత రాష్ట్రానికి మరో మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రకు అతి ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా రికార్డ్ సాధించినప్పటికీ, ఒక్కసారి కూడా పూర్తి స్థాయి (ఐదేళ్ల పాటు) ప్రభుత్వాన్ని నడపలేదు. ఆయన గ్రామీణ మహారాష్ట్ర నుంచి ఎదిగిన నాయకుడు.

అందుకే రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధి విషయంలో తనకు తాను దూరదృష్టి గలవాడని నిరూపించుకున్నాడు. సైద్ధాంతిక వ్యత్యాసాలను అధిగమించి అధికార, ప్రతిపక్ష నాయకుల నుంచి సద్భావనను సంపాదించడం, దాన్ని కొనసాగించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ అనుభవం జాతీయ రాజకీయాల్లో సైతం బాగా పనికి వచ్చింది. 1991-1996 మధ్య ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రభుత్వంలో మొదటిసారి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో కేంద్ర రక్షణ మంత్రిగా అవకాశం లభించింది. అనంతరం 1998-1999లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నాయకుడిగా పగ్గాలు నిర్వహించారు.

కాంగ్రెస్ నుంచి బహిష్కరణ
అయితే 1999లో సోనియా గాంధీతో ఆయనకు విబేధాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీలో అప్పటికే పవార్ పెద్ద నాయకుల్లో ఒకరు. పైగా మంచి గ్రాఫ్ ఉన్న నేత. అంతే కాకుండా పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదగాలనే ఆలోచనతో సోనియాను వ్యతిరేకించారు. అందుకు ఆమెను విదేశీ మూలాలు కలిగిన వ్యక్తంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

ఎన్సీపీ స్థాపన
ఇది ఆయనకు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌లను సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి తనతో పాటు తీసుకెళ్లి ఎన్సీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన ఏడాదిలోనే మహారాష్ట్రతో పాటు గోవా, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు రాబట్టారు. దీంతో ఆ పార్టీలో జాతీయ పార్టీ గుర్తింపు లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన.. సొంత పార్టీని స్థాపించాక ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. ఇది మధ్య మధ్యలో చీలికలు వచ్చినప్పటికీ చాలా కాలం పాటు ఇరు పార్టీలు కలిసే పోటీ చేశాయి.

Karnataka Polls: బాగా డేర్ చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ఇస్లామిక్ సంస్థతో పాటు హిందూ సంస్థనూ రద్దు చేస్తారట

మహారాష్ట్ర ప్రజానికంలోకి ఎన్సీపీ బలంగానే వెళ్లింది. 1999లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో ఎన్సీపీ 58 సీట్లు సాధించింది. ఆ సమయంలో ఆ పార్టీకి 22.60 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 27.20 శాతం ఓట్లతో 75 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ ఎన్నికల్లో శివసేనకు 69 సీట్లు (17.33% ఓట్లు), బీజేపీకి 56 (14.54% ఓట్లు) వచ్చాయి. ఇక 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18.75 శాతమే ఓట్లు సాధించినప్పటికీ 71 స్థానాలను కైవసం చేసుకుని, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా ఎన్సీపీ అవతరించింది. అయినప్పటికీ, మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి పదవిని పవార్ అప్పగించారు. అయితే హోం, ఫైనాన్స్, ఇంధనం, గ్రామీణాభివృద్ధి, జలవనరులు వంటి ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను తన పార్టీ వారికి ఇచ్చుకున్నారు.

జాతీయ రాజకీయాలు
2004-2014 మధ్య మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. శరద్ పవార్‭కు ఈ పదవి బాగా సరిపోతుందని చాలా మంది నేతలు ప్రశంసించారు. గ్రామీణ నేపథ్యం నుంచి రావడం, గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం మీద పట్టు ఉండడంతో ఈ శాఖ ఆయనకు బాగా సహాయపడింది. ఆ సమయంలో భారతదేశం ఆహారధాన్యాలలో మిగులును సాధించడంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత శరద్ పవార్‭దే. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్సీపీ నుంచి లోక్‭సభలో ఆయన ఒక్కరే ఉన్నారు. అయినప్పటికీ తన చతురతతో కేంద్రమంత్రి పదవిని సాధించారు.

బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి ఏర్పాటులో కీలకం
1999-2014 మధ్య మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. అనంతరం దేశంలో వీచిన మోదీ గాలి మహారాష్ట్రనూ ప్రభావితం చేసింది. అదే ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం
సాధించింది. దీంతో మహారాష్ట్రలో ఎలాగైనా సొంతంగా నిలదొక్కుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు మిత్రపక్షం శివసేనపై కూడా బెదిరింపులకు పాల్పడింది. దీంతో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ-శివసేన బంధం తెగిపోయింది. ఆ సమయంలో బీజేపీ హిందుత్వ వాదానికి వ్యతిరేకంగా.. మహా వికాస్ అగాఢీ పేరుతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలను కలిపి సెక్యూలర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో శరద్ పవార్‭ది క్రియాశీలక పాత్ర.

అయితే మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం మూడేళ్లకుకూలింది. శివసేన నుంచి ఏర్పడ్డ చీలిక బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మహా వికాస్ అగాఢీ కూటమి చీలిపోలేదు. మహా వికాస్ అగాఢీ కూటమిలో అనేక మనస్పర్థలు వచ్చినప్పటికీ చీలిపోకుండా ఉందంటే దానికి కారణం పవార్. కాంగ్రెస్, శివసేనకు కూడా ఆయన ప్రధాన రాజకీయ సలహాదారుడు అయ్యారు.

ఎన్సీపీకి జాతీయ పోయిన కొద్ది రోజులకే..
ఇన్నాళ్లు జాతీయ పార్టీగా వెలుగొందిన ఎన్సీపీకి కొద్ది రోజుల క్రితమే ఆ హోదా పోయింది. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఉన్న రాష్ట్ర హోదా కోల్పోవడంతో జాతీయ హోదా సైతం రద్దైంది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామాను ప్రకటించారు. దేశంలో వీచిన మోదీ గాలి ఎన్సీపీపై తీవ్ర ప్రభావం చూపింది. మహారాష్ట్రలోనూ ఆ పార్టీ కాస్త బలహీన పడింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాల్గవ స్థానానికి పడిపోయింది. 2019లోనూ దాదాపుగా అలాంటి ఫలితాన్నే చూసింది. అయితే మహారాష్ట్రలో బీజేపీ ఎంత ఎదిగినప్పటికీ ఎన్సీపీ 16.71 శాతం ఓట్లను సాధించింది.

Maharashtra Politics: చెత్త రాజకీయాలు.. శరద్ పవార్ రాజీనామాపై సంజయ్ రౌత్ భిన్న స్పందన

శరద్ పవార్ రాజకీయ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. విపక్షాలు ఒక అంశంపై పోరాటం చేస్తుంటే, ఆయన కాస్త వారికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఎన్సీపీ ఎవరినీ అంత గట్టిగా విమర్శించదు. కానీ అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలని విపక్షాలు భావిస్తున్న సమయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ మధ్యే అదానీ గ్రూప్స్ వ్యవహారమే చూసుకుంటే.. మిత్రపక్షం కాంగ్రెస్ ఈ విషయంపై దేశ వ్యాప్తంగా హడావుడి చేస్తుంటే.. పవార్ మాత్రం అదానీతో సమావేశం అయ్యారు.

వీడీ సావర్కర్‌పై (మహారాష్ట్రలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి) రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, లేదా అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరడంపై మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు భిన్నమైన వైఖరి తీసుకున్నారు. మోదీ, అమిత్ షా వంటి వారిపై కూడా అనేక సందర్భాల్లో సానుకూలంగా స్పందించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అయితే ఏకంగా బీజేపీని పొత్తుకు ఆహ్వానించారు. మహారాష్ట్రలో ఎంవీఏను దాటి ఎన్సీపీ ఆలోచిస్తోందన్న ఊహాగానాలు ఒకవైపు కొనసాగుతున్న తరుణంలోనే పవార్ రాజీనామాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.