పీకేపై జగన్ అసహనం : ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యిందా!

వైసీపీకి ఇమేజ్ పెంచుతుందని భావించిన కార్యక్రమంపై జగన్‌ ఎందుకు నారాజ్‌గా ఉన్నారు ? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది.

  • Publish Date - February 17, 2019 / 03:03 PM IST

వైసీపీకి ఇమేజ్ పెంచుతుందని భావించిన కార్యక్రమంపై జగన్‌ ఎందుకు నారాజ్‌గా ఉన్నారు ? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది.

హైదరాబాద్ : మేధావులను తనవైపు తిప్పుకునేందుకు.. పీకే ఇచ్చిన సలహా అన్న పిలుపు కార్యక్రమం. టైటిల్‌ బాగానే ఉన్నా.. ఓవరాల్‌ ఔట్‌పుట్‌పై వైసీపీ అధినేత జగన్‌ గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. వైసీపీకి ఇమేజ్ పెంచుతుందని భావించిన కార్యక్రమంపై జగన్‌ ఎందుకు నారాజ్‌గా ఉన్నారు ? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది. 

 

అన్న పిలుపు.. తటస్థుల్ని పార్టీవైపు తిప్పుకునేందుకు వైసీపీ అధినేత జగన్‌ వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం. ప్రజాసంకల్ప యాత్రలో కలవని మేధావులు, ఏ పార్టీకి సంబంధం లేకుండా తటస్థంగా ఉన్న వారితో ముఖాముఖిగా మాట్లాడేందుకు అన్న పిలుపు పీకే టీమ్ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. అందులో భాగంగా జగన్‌ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ.. వారిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. పర్యటనల సందర్బంగా కేవలం తటస్థులతోనే సమావేశమై.. అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నారు. పార్టీలకు ఓటు బ్యాంకు స్థిరంగా ఉన్నప్పటికీ.. తటస్తుల ఓట్లే గెలుపోటములను శాసిస్తాయి. అందుకే వీరిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని జగన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

 

పాదయాత్ర సందర్భంగా  70వేల మందిని గుర్తించి….వారందరికి ప్రత్యేకంగా లేఖలు రాశారు. తమ స్థాయి పరిధుల్లో సమాజం కోసం అంతో ఇంతో మేలు చేసిన వారికి తటస్తులుగా ఎంపిక చేయాలని సూచించారు. మేధావులతో భేటీ అయి.. స్థానిక సమస్యలు తెలుసుకోవాలని భావించారు. పార్టీ కార్యకర్తలను కాకుండా తటస్తులు, సామాజిక వేత్తలను కలిస్తే.. పార్టీకి లబ్ది చేకూరుతుందని జగన్‌ భావించారు. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. వారంటే స్థానికంగా ఉండే ప్రజలకు గౌరవం ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సమావేశమై.. పార్టీ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతలను పీకే టీమ్‌కు అప్పగించారు జగన్‌. అయితే తటస్థులైన 70 వేల మందితో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో అన్న పిలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటికి పీకే టీం భారీ జన సమీకరణ చేసింది. కానీ.. కార్యక్రమం నిర్వహణ తీరుపై జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తటస్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని జగన్‌ భావిస్తే.. సమావేశాల్లోపార్టీ కార్యకర్తలే కనిపిస్తున్నారు. దీంతో ఇది తటస్తుల కార్యక్రమమా లేదంటే.. పార్టీ కార్యకర్తల కార్యక్రమమో తెలియడం లేదని జగన్ అన్నట్లు తెలుస్తోంది.

 

అన్న పిలుపు కార్యక్రమానికి వచ్చిన వారికి స్థానిక సమస్యలపై అవగాహన ఉండటం లేదు. వచ్చిన వారంతా నలుగురితో ఓట్లు వేయిస్తారా అంటే అది చెప్పలేని పరిస్థితి. దీంతో గుర్రుగా ఉన్న జగన్‌.. అన్నపిలుపు కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయవద్దని పీకే టీమ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా…తటస్థులు, మేధావులను మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించినట్లు తెలుస్తోంది. మలి విడతలో అయినా పార్టీ కార్యకర్తలు రాకుండా…జాగ్రత్తలు తీసుకోవాలని పీకే టీమ్‌ను హెచ్చరించినట్లు సమాచారం.