ఆయన ఆశీస్సులు ఉన్న వారికే ఎమ్మెల్యే టికెట్..! నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు

అర్ధ, అంగ బలాల్లో తిరుగులేని నారాయణను కట్టడి చేయాలంటే రెడ్డి సామాజిక వర్గ నేత అయితేనే సాధ్యమని భావిస్తున్న వైసీపీ.. పలువురి పేర్లు పరిశీలించినా.. చివరికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతిరెడ్డి పేర్లను ఎంపిక చేసింది.

Nellore City YSRCP : నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను తప్పించాలని పట్టుబడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన మాట నెగ్గించుకుంటే.. కొత్తగా వచ్చే వారు ఎవరికైనా సరే సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌ అశీస్సులు ఉండాల్సిందేనని కండీషన్‌ పెట్టడం ద్వారా ఎమ్మెల్యే ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని సంకేతాలిస్తోంది వైసీపీ అధిష్టానం.

ఎమ్మెల్యేల మార్పులు.. చేర్పులతో సిట్టింగ్‌లకు స్థానచలనం కల్పిస్తున్న వైసీపీ హైకమాండ్‌.. కొందరి విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను ఈసారి నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించడంతో.. సిటీ ఇన్‌చార్జి నియామకం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన అనిల్‌ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని తహతహలాడారు. ఐతే వైసీపీలో అంతర్గత పోరుతో ఆయన సీటు మారాల్సి వచ్చింది. అనిల్‌ను మార్చితేనే తాను లోక్‌సభకు పోటీచేస్తానని నెల్లూరు ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కండీషన్‌ పెట్టినట్లు ముందుగా ప్రచారం జరిగింది.

దీనికి సీఎం జగన్‌ తొలుత అంగీకరించకపోయినా.. నరసరావుపేట ఎంపీగా ఎవరిని నియమించాలనే తర్జనభర్జనలో అనిల్‌కుమార్‌ పేరు అనూహ్యంగా తెరపైకి తేవడంతో నెల్లూరు సిటీని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ విధంగా ఈ మార్పు వెనుక వేమిరెడ్డి హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. అనిల్‌ను తప్పించి ఆ స్థానం నుంచి తన భార్య ప్రశాంతిరెడ్డిని పోటీకి పెట్టాలని వేమిరెడ్డి ప్లాన్‌ చేశారంటున్నారు.

Also Read : పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం

ఐతే వేమిరెడ్డి ఒకటి తలిస్తే.. వైసీపీ అధిష్టానం ఇంకోలా నిర్ణయం తీసుకున్నదంటున్నారు. సిటీ సీటును వేమిరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మద్దతు ఉంటుందో వారికే సీటు ఇవ్వాలని నిర్ణయించిందంట వైసీపీ అగ్రనాయకత్వం. దీంతో సిటీ నుంచి అనిల్‌ను మార్చినా.. ఆయన ప్రాధాన్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదనే సంకేతాలిచ్చినట్లైంది. అనిల్‌ను తప్పించి పైచేయి సాధించానని వేమిరెడ్డి భావిస్తే.. అనిల్‌ మద్దతు ఉంటేనే సీటు ఇస్తామన్న మెలిక పెట్టడం ద్వారా ఇద్దరిలో ఏ ఒక్కరినీ విస్మరించకుండా.. సమప్రాధాన్యం ఇచ్చినట్లైందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు.

Also Read : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి నారాయణ పోటీ చేయనున్నారు. ఆయన ఇప్పటికే నెల్లూరులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అర్ధ, అంగ బలాల్లో తిరుగులేని నారాయణను కట్టడి చేయాలంటే రెడ్డి సామాజిక వర్గ నేత అయితేనే సాధ్యమని భావిస్తున్న వైసీపీ.. పలువురి పేర్లు పరిశీలించినా.. చివరికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతిరెడ్డి పేర్లను ఎంపిక చేసింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే చాన్స్‌ ఉందంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరైనా వైసీపీకి ఓకే గాని.. ఎమ్మెల్యే అనిల్‌ ఎవరికి టిక్కు పెడతారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు