జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అని వైసీపీ అధికారి ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన ఏకైక నాయకుడు పవన్ అని ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అని వైసీపీ అధికారి ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన ఏకైక నాయకుడు పవన్ అని ఎద్దేవా చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం (డిసెంబర్ 5, 2019) కడపలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించారు. కొన్ని రోజులుగా కనుమరుగైన పవన్ కళ్యాణ్ అజ్ఞానంతో మళ్లీ బయటకు వచ్చాడని విమర్శించారు.
చంద్రబాబు సూచనల మేరకే రోజుకొక ముసుగు ధరించి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి, టీడీపీ హయాంలో అవినీతి జరుగుతుంటే నిద్రపోయావా అంటూ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా వామపక్షాలతో కలిసి ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయన సూచనలతోనే బీజేపీ చంకనెక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో అభిమానం లేక పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర పరాజయం చెందిన పవన్, ఆయన స్థానం ఏంటో తెలుసుకొని మాట్లాడాలన్నారు.
కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తూ, జగన్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పట్ల అవహేళనగా మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది ఎవరని తిరిగి ప్రశ్నించారు. గతంలో ఇంగ్లీష్‌లో ట్వీట్లు పెట్టినప్పుడు తెలుగు చచ్చిపోయిందా అంటూ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంపై పవన్ చేసిన అనవసర రాద్ధాంతాన్ని కొట్టిపారేశారు. రేపిస్టులకు రెండు చెంప దెబ్బలు చాలని అనడం సిగ్గుచేటన్నారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.