గన్నవరంలో పొలిటికల్ హీట్ : యార్లగడ్డ అసంతృప్తి

  • Publish Date - October 26, 2019 / 07:55 AM IST

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రూట్‌ మారుస్తుండడంతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు యార్లగడ్డ. దీంతో గత ఎన్నికల్లో వల్లభనేనితో పోటీ పడి.. ఇప్పుడు కలిసి పని చేయాల్సి వస్తుందనే ప్రచారంపై యార్లగడ్డ అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే, ఆయన అనుచరులు, కార్యకర్తలు యార్లగడ్డ ఇంటికి చేరుకున్నారు. 

వల్లభనేని వంశీ చేరికపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డితో.. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. నిన్న జగన్‌తో దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు వంశీ. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. వంశీని జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. వంశీని చేర్చుకోవాలనుకోవడంపై వైసీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

మరోవైపు వంశీ పార్టీ మారాలని డిసైడ్ అయ్యి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యం అయ్యే పనేనా అనే డౌట్ వస్తోంది. ఒక వేళ వంశీ  టీడీపీకి రాజీనామా చేస్తే గన్నవరం నియోజక వర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. విజయావకాశాలపై వంశీలో అయోమయం నెలకొన్నట్లు తెలుస్తోంది.  సీఎం జగన్‌ను కలువ ముందు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ కావడంతో మరింత చర్చ జరిగింది. ఆయన పార్టీకి ఎప్పుడు రాజీనామా చేస్తారో..వైసీపీలో ఎప్పుడు చేరుతారన్నది రానున్న రోజుల్లో తెలియనుంది. 
Read More :హైటెక్ ముఠాలు : డెబిట్ కార్డుల డేటా చోరీ