అలా అనుకుంటే కడపనే రాజధానిని చేసేవారు : కొడాలి నాని

  • Publish Date - January 20, 2020 / 12:35 PM IST

రాష్ట్రం మొత్తం అభివృధ్ది జరగాలనే సదుద్దేశ్యంతోనే సీఎం జగన్ 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే కొందరి వాదనను ఆయన కొట్టిపారేశారు. సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల  అంశంపై జరిగిన చర్చలో కొడాలి నాని  మాట్లాడుతూ…. ఈ బిల్లును ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు.  

కమ్మ సామాజిక వర్గాన్నిజగన్ దెబ్బ తీయాలి అనుకుని ఉంటే కడపనే రాజధానిగా చేసి ఉండేవారని నాని  వివరించారు. రాజధాని విషయంలో సామాజిక అంశాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని.. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖకు తరలి వెళ్లినా అక్కడా కమ్మకులస్తులదే ఆధిక్యం అని కొడాలినాని చెప్పుకొచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నంలో కమ్మసామాజిక వర్గానికి చెందిన వారే ఎంపీలుగా గెలుస్తున్నారని  కొడాలి వివరించారు. 

విశాఖలో ఉన్నసినిమా ధియేటర్లు, వ్యాపార సంస్ధలు, విద్యాసంస్ధలు, ఎక్కువ భాగం కమ్మసామాజిక వర్గం వారి చేతుల్లోనే ఉన్నాయని ఆయన చెప్పారు. విశాఖలో ఉన్న  ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు కూడా మావే అని అయన చెప్పుకొచ్చారు. అక్కడున్న వ్యాపారాల్లో 50 నుంచి 80 శాతం మావే అని చెప్పారు. కాబట్టి కమ్మ సోదరులు ఎవరూ అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిగారు  కమ్మవారిని నాశనం చేయాలనే ఉద్దేశం ఉండి ఉంటే రాజధాని కడప, కర్నూలో వెళ్లేదని…ఆయన మంచి ఉద్దేశ్యంతోనే విశాఖకు తరలిస్తున్నాడని చెప్పారు.  ఉత్తరాంధ్ర ప్రజలు చాలా  మంచి వారని …అక్కడకు  ఎవరు వెళ్లినా వారిని గెలిపిస్తారని నాని తెలిపారు.