దేవాదాయభూముల పరిరక్షణకు కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలోని ఎల్లోమీడియా దేవాదాయభూములపై అసత్యపు కధనాలను ప్రచురిస్తోందని….. టిడిపి పాలనలో జరిగిన దేవాలయ భూముల అవినీతి ఎల్లోమీడియాకు కనిపించ లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలిలో దేవాలయ భూములపై తప్పుడు కధనాలు రాశారని….ప్రభుత్వంపై బురదచల్లేవిధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఆదివారం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
దేవాదాయభూములను పవిత్రమైన భూములుగా భావిస్తామని….దేవాదాయభూములను ఎవరికి ధారాధత్తం చేయడంలేదని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. దేవాదాయశాఖలో గజం స్దలం అమ్మాలంటే హైకోర్టుపర్మిషన్ కావాలని, ఈచిన్న విషయం కూడా చంద్రబాబు అండ్ పార్టీకి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో మఠం భూములను ఇష్టారాజ్యంగా లీజులకు ఇచ్చేశారని…గత ప్రభుత్వం చేసినట్లుగా దేవాదాయభూములను ధారాదత్తం చేయలేదని వెల్లంపల్లి తెలిపారు.హధీరాంజీ మఠం భూముల దుర్వినియోగంపై చర్యలు తీసుకున్నామని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
దేవాదాయ శాఖలో గతంలో టిడిపి నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని…అర్చక సంక్షేమనిధులపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని బ్రాహ్మణకార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ మల్లాది విష్ణు ఆరోపించారు. మూడు రోజులక్రితం 234 కోట్ల రూపాయలు అర్చక సంక్షేమనిధిని దారిమళ్లించిందని మాజీ ఛైర్మన్ నిరాధార ఆరోపణలు చేశారని మల్లాది విష్ణు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం అర్చక సంక్షేమ నిధిని ఏర్పాటుచేశారని…171 కోట్ల ఎఫ్.డి.ఆర్ లు ఉన్నాయని…దాని గైడ్ లైన్స్ ప్రకారం ఖర్చుచేస్తామని విష్ణు తెలిపారు.
ఫిక్స్ డ్ డిపాజిట్లను రద్దుచేసి వాటిని ఖర్చు చేసే అధికారం ఎవరికి ఉండదని…అది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తుందని ఆయన తెలిపారు. అర్చక వెల్ఫేర్ బోర్డులో ఉపనయనాలు,విద్య,వివాహం చేసుకునేవారికి, వైద్యసహాయం వంటివి చేయడం జరుగుతుందని విష్ణు చెప్పారు.
2019-20 సంవత్సరానికి అర్చక వెల్ఫేర్ బోర్డునుంచి దాదాపు పది కోట్ల రూపాయలు ఉపనయనం చేసుకున్న81 మందివారికి 20 లక్షలు, అలాగే వివాహం చేసుకున్నవారికి 73 మందికి 73లక్షలు, విద్యకు సంబంధించి 132 మందికి 71 లక్షలు, పదవీ విరమణ చేసినవారికి 7 లక్షల 15 వేలు, వేదపాఠశాలలకు సంబంధించినవారికి 80 వేలు ఇలా 8 అంశాలను అధికారుల సమక్షంలో ఏడు నెలల కాలంలో ఖర్చుపెట్టడం జరిగిందని వివరించారు. ఇందుకోసం 234 కోట్లు ఖర్చు అయితే.. అది అర్చక సంక్షేమ నిధి దారి మళ్లిందని మాజీ చైర్మన్ ఆనందసూర్య ఆరోపిస్తే దానిని ఓ పత్రిక ప్రముఖంగా ప్రచురించిందని, ఇలా చేయడం సరికాదని మల్లాది విష్ణు హితవు పలికారు.