జగన్ కేరాఫ్ అమరావతి: ఫిబ్రవరి 27నుంచి!

  • Publish Date - February 25, 2019 / 02:00 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అమరావతి నుంచే రాజకీయ చక్రాలను తిప్పేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత జగన్ సిద్దం అవుతున్నారు. రాజధాని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో చేరేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన నూతన గృహప్రవేశం చేసేందుకు జగన్ ముహుర్తం పెట్టుకున్నారు. అలాగే పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని కూడా ఆయన అక్కడ ప్రారంభించబోతున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైయస్ జగన్ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో ఉండబోతుంది. ఈ రెండు నిర్మాణాలు ఎకరం 90 సెంట్లలో రూపుదిద్దుకుంటుండగా రాబోయే కాలంలో ఇక్కడి నుంచే జగన్ రాజకీయాలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంకు పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటనలో తెలిపారు.

జగన్ ఉండేచోటు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. జగన్.. ప్రస్తుతం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉంటున్నారు. పార్టీ మీటింగ్స్ కానీ, వ్యక్తిగత కార్యక్రమాలు కానీ అన్నీ లోటస్ పాండ్ నుంచే ఆపరేట్ చేస్తున్నారు.  ఇకపై రాజకీయ కార్యకలాపాలు అన్నీ అమరావతి నుండే జగన్ ఆపరేట్ చేయబోతున్నారు.