వైసీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్‌ పాలిటిక్స్‌

చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని

  • Publish Date - March 5, 2019 / 08:32 AM IST

చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని

చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని వెళ్తుంటాయి. ఎట్టి  పరిస్థితుల్లోనూ వాళ్లు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని వ్యూహాలకు పదును పెడుతుంటాయి. ఈసారి కూడా పరస్పరం కొందరు నేతల్ని టార్గెట్‌ పెట్టడంతో రాజకీయాలు రసకందాయంగా  మారాయి.

వర్గ రాజకీయాలకు, ప్రతీకార పోరుకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో ఇదే తరహా రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రతీకార రాజకీయాలకు  నేతలు పదును పెడుతున్నారు. అవతల పార్టీలోని ఇద్దరు, ముగ్గుర్ని టార్గెట్ చేసి వారిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఎవరికి వారు వ్యూహలు రచిస్తున్నారు. ఈ టార్గెట్‌ పాలిటిక్స్‌ వెనక ఎవరి  కారణాలు వారికున్నాయి.
Also Read : అటో ఇటో ఎటో : పవన్ కల్యాణ్ తో మాగుంట భేటీ

టీడీపీ టార్గెట్ లిస్ట్‌లో తొలి పేరు వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్, నగరి ఎమ్మెల్యే రోజా. రెండో పేరు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, మూడో టార్గెట్ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. వైసీపీ తక్కువేం తినలేదు. వాళ్లు ఏకంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్‌ చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు ముఖ్య నేతలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.  
చిత్తూరు జిల్లాలో వైసీపీ నిర్దేశించుకున్న మొదటి టార్గెట్ మంత్రి అమర్నాథ్ రెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పుంగనూరులో గెలిచి చివరకు పార్టీ మారి మంత్రి అయిన అమర్నాథ్ రెడ్డి  వ్యవహారాన్ని వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఆయనను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది. అయితే అమర్నాథ్ రెడ్డిని పలమనేరులో ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి మాత్రం వైసీపీకి లేడనే చెప్పాలి. మొన్నటిదాకా పలమనేరు వైసీపీకి ముగ్గురు ఇంచార్జిలు ఉండేవారు. అందులో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఒకరు. ఇప్పుడు వీరందరినీ కాదనుకుని వెంకట గౌడ్ అనే ఓ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. అమర్నాథ్‌ను ఓడించడానికి పెద్దిరెడ్డి ప్రత్యేక కసరత్తే చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో వెంకట గౌడ్‌ను తెరపైకి తెచ్చింది కూడా పెద్దిరెడ్డే.

వైసీపీ రెండో టార్గెట్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడైన కిషోర్ పీలేరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పీలేరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే  చింతల రామచంద్రారెడ్డిని కిషోర్ ఢీ కొనబోతున్నారు. అన్న కిరణ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరగా.. కిషోర్ టీడీపీలో చేరారు. పార్టీలో చేరినప్పుడే చంద్రబాబు కిషోర్‌కు పీలేరు టిక్కెట్ ఖరారు చేసారు. ఏపీ  హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ పదవి కూడా కట్టబెట్టారు. పీలేరుతో పాటు పుంగనూరు గెలుపు బాధ్యతలను కూడా కిషోరే చూస్తున్నారు. పుంగనూరు బరిలో ఉన్న పెద్దిరెడ్డిని కట్టడి చేసే బాధ్యత  కిషోర్‌దే.

వాస్తవానికి జిల్లాలో పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాలది దశాబ్ధాల వైరం. పెద్దిరెడ్డి, కిరణ్‌ల మధ్య చాలా ఏళ్లుగా మాటలు కూడా లేవు. ఇద్దరూ నాడు కాంగ్రెస్‌లోనే ఉన్నా.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే  పరిస్థితి. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. పెద్దిరెడ్డిని మంత్రివర్గంలోకి కూడా తీసుకోలేదు. సీఎంగా ఉన్న కిరణ్‌పై పెద్దిరెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి పలుసార్లు  ఫిర్యాదు కూడా చేశారు. అన్న సీఎంగా ఉండగా జిల్లాలో కిషోర్ పెత్తనం ఓ రేంజ్‌లో నడిచింది. పెద్దిరెడ్డి మాటకు పార్టీలో ఏ మాత్రం విలువ లేకుండా చేశారు నల్లారి సోదరులు. ఒకానొక దశలో  ఏకంగా మీడియా ముందుకొచ్చి సీఎం కిరణ్ పదవిని ఊడగొడతానని పెద్దిరెడ్డి శపథం చేశారు. ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడం, పీలేరు అభ్యర్థి కావడంతో స్వతహాగానే పెద్దిరెడ్డితో  ఉన్న వైరం మరింత ముదిరింది. పుంగనూరులో పెద్దిరెడ్డిని కట్టడి చేయాలని కిషోర్ వ్యూహాలు రచిస్తుండగా, పీలేరులో కిషోర్‌కుమార్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని పెద్దిరెడ్డి కంకణం కట్టుకున్నారు.
Also Read : టీడీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్‌ పాలిటిక్స్‌

ఇక వైసీపీ టార్గెట్‌ లిస్ట్‌లో సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించలేకపోయినా.. కనీసం మెజారిటీని గణనీయంగా తగ్గించాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. చంద్రబాబుపై  వైసీపీ నుంచి చంద్రమౌళి పోటీపడనున్నారు. 2014 ఎన్నికల్లోనూ బాబుపై పోటీచేసి 55వేల ఓట్లు సాధించారు చంద్రమౌళి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారైన చంద్రమౌళి వన్నెకుల క్షత్రియ  సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ వర్గం వీరిదే. ఈయనకు లభించిన 55వేల ఓట్లలో సింహభాగం వీరివే. చంద్రబాబుపై పోటీని చంద్రమౌళి కూడా చాలా  సీరియస్‌గానే తీసుకుంటున్నారు. చంద్రమౌళిని గెలిపించండి.. ఆయన్ను మంత్రిని చేస్తా.. అని ఆ మధ్య కుప్పం పర్యటనలో జగన్ హామీ కూడా ఇచ్చారు. వైసీపీ నేతలు కూడా చంద్రమౌళిని బాగా  ప్రోత్సహిస్తున్నారు. కుప్పంలో అద్భుతం జరగాలని వైసీపీ ఆశిస్తోంది.

మొత్తం మీద వైసీపీ టార్గెట్‌లో చంద్రబాబు కూడా చేరిపోయారు. ఇలా చిత్తూరు జిల్లాలో టీడీపీ, వైసీపీలు చెరో ముగ్గుర్ని ఓడించడం టార్గెట్‌గా పెట్టుకుని ముందుకెళ్తున్నాయి. పేరుకు ముగ్గురే  అయినా.. వీరిని కదిలిస్తే మిగిలిన నియోజకవర్గాల్లోనూ భారీ ప్రభావం ఉంటుందనేది ఈ రెండు పార్టీల ఆశ.