Anivara Asthanam : తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ఆణివార ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో 17వ తేదీ ఆదివారం సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు.

Tirumala Anivara Ashanam

Anivara Asthanam : తిరుమల శ్రీవారి ఆలయంలో 17వ తేదీ ఆదివారం సాలకట్ల ఆణివార ఆస్థానం  నిర్వహించనున్నారు. ఈసందర్భంగా రేపు జరగాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర  దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే    సౌర మానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు.

పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి–ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు.  మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు  దక్షిణాభి ముఖంగా వేంచేపు చేస్తారు.

ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి  వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

Also Read :Viral video: దేశం గ‌ర్విస్తోంది.. విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న పాప వీడియో