Chaitra Navratri 2026 Diyas : చైత్ర నవరాత్రులు.. ఈ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే.. మీకిక తిరుగుండదు

Chaitra Navratri 2026 Diyas : చైత్ర నవరాత్రులు పాటిస్తున్నారా.. అయితే దీపం ఏప్రదేశాల్లో ముట్టిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం

chaitra navratri 2026 auspicious places to light lamps details here

Chaitra Navratri 2026 Diyas : ఉగాది నుంచి చైత్ర నవరాత్రులు మొదలయ్యాయి. దసరా పండుగ సమయంలో వచ్చే నవరాత్రుల మాదిరే.. చైత్ర నవరాత్రులను కూడా చాలా మంది భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. వీటినే వసంత నవరాత్రులు అని కూడా అంటారు. చైత్ర నవరాత్రి సమయంలో దుర్గాదేవిని కొలుస్తారు. తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. ఉగాది పండగతో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రులు.. శ్రీరామనవమితో ముగుస్తాయి. ఈ చైత్ర నవరాత్రుల సమయంలో భక్తులు కలశాన్ని స్థాపించి.. అఖండ దీపం వెలిగించి.. భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధిస్తారు.

దీపం వెలిగించడం ద్వారా అమ్మ అనుగ్రహాన్ని త్వరగా పొందుతారని నమ్ముతారు. ఈ క్రమంలోనే చైత్ర నవరాత్రుల సమయంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే.. అమ్మ ఆశీర్వాదాలు మెండుగా లభిస్తాయని భావిస్తారు. మరి ఈ చైత్ర నవరాత్రుల్లో దీపాలు వెలిగించాల్సిన ఆ ముఖ్యమైన ప్రదేశాలు ఏవో మీరు కూడా తెలుసుకుని.. ఆ ప్రదేశాల్లో దీపం వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి.

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద
ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే మంచిదని నమ్ముతారు. అది కూడా సాయంత్రం సమయంలో.. ద్వారం కుడి వైపున నూనె లేదా నెయ్యి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే.. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయంటున్నారు.

తులసి కోట వద్ద
హిందువులు తులసి మాతను లక్ష్మీదేవి అవతారంగా పరిగణిస్తారు. ఈ చైత్ర నవరాత్రుల్లో ప్రతి రోజు సాయంత్రం.. తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే వాస్తు దోషాలను తొలగిస్తుందని చెబుతున్నారు.

వంటగది
వంటగదిలో అన్నపూర్ణాదేవి సానుకూల శక్తిగా కొలువై ఉంటుంది. అందుకే రాత్రిపూట వంటగదిలో దీపం వెలిగించడం వల్ల ఆహారం, ధనం సమృద్ధిగా ఉంటాయంటున్నారు.

లాకర్
డబ్బు, విలువైన వస్తువులు ఉంచిన చోట దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆశీర్వాదాలు కలుగుతాయని చెబుతున్నారు.

ఇంటి మధ్యలో
ఈ చైత్ర నవరాత్రుల్లో ఇంటి మధ్యలో దీపం వెలిగిస్తే.. ఇంటిలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయంటున్నారు. ఈ విధంగా, నవరాత్రుల సమయంలో ప్రత్యేక ప్రదేశాల్లో దీపం వెలిగించడం ద్వారా భక్తి మాత్రమే కాకుండా ఇంటి శుభం, సౌభాగ్యం, ధనం కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని 10v ధృవీకరించడం లేదు.