Narasimha Jayanthi 2026 : అష్టైశ్వర్యాలు ప్రసాదించే నరసింహ జయంతి.. పూజా ముహూర్తం, పూజావిధానం మీ కోసం!
Narasimha Jayanthi 2026 : నరసింహ జయంతి ఏప్రిల్ 30న వస్తుంది. అత్యంత శక్తివంతమైన ఈ శుభదినం నాడు నరసింహ స్వామిని ఏ విధంగా పూజించాలి అంటే..
narasimha jayanthi 2026 significance puja muhurat and fasting rules prasad details
Narasimha Jayanthi 2026 : వైశాఖ మాసంలో వచ్చే అత్యంత శక్తివంతమైన పర్వదినాల్లో నరసింహ జయంతి ప్రధానమైనది. హిరణ్యకశిపుని అంతం చేసి, తన పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు మహావిష్ణువు స్తంభం నుండి నరసింహ అవతారంలో ఉద్భవించిన రోజు ఇదే. దశావతారాలలో గర్భవాసం లేకుండా, కేవలం భక్తుడి పిలుపు కోసం తక్షణం ఆవిర్భవించిన విశిష్ట రూపం నరసింహావతారం. అంతటి విశిష్టమైన నరసింహ జయంతి నాడు.. ఇక్కడ చెప్పిన విధంగా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంటున్నారు.
ముహూర్తం, తేదీ:
పురాణాల ప్రకారం నరసింహ స్వామి వైశాఖ శుక్ల చతుర్దశి నాడు సంధ్యా సమయంలో అవతరించారు. 2026లో ఈ తిథి ఏప్రిల్ 29 రాత్రి 7:51 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 30 రాత్రి 9:12 గంటలకు ముగుస్తుంది. హిందువులు సూర్యోదయ తిథిని అనుసరించి పండుగలు జరుపుకుంటారు కనుక.. ఏప్రిల్ 30, గురువారం నాడు నరసింహ జయంతిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పూజకు అత్యంత శుభప్రదమైన సమయం ఏప్రిల్ 30, సాయంత్రం 4:27 నుండి 7:00 గంటల వరకు.
ఇంట్లోనే పూజా విధానం:
ఆలయాలకు వెళ్లలేని వారు భక్తిశ్రద్ధలతో ఇంట్లోనే స్వామిని ఆరాధించవచ్చు.
నియమాలు:
ఏప్రిల్ 29 రాత్రి నేల మీద శయనించి, శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఏప్రిల్ 30న బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి పూజా గదిని అలంకరించుకోవాలి.
ఉపవాసం:
ఈ రోజు సాధ్యమైనంత వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం శ్రేష్టం. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.
సాయంత్రం పూజ:
పైన పేర్కొన్న ముహూర్త సమయంలో స్వామికి పాలు, తేనెతో అభిషేకం నిర్వహించి.. పానకం, వడపప్పు, చలివిడి నైవేద్యంగా సమర్పించాలి. నరసింహ కవచం, అష్టోత్తరాలు పఠించి నేతి దీపంతో హారతి ఇవ్వాలి.
జపించాల్సిన మంత్రం:
“ఉగ్రం వీరం మహావిష్ణుం…” అనే శ్లోకాన్ని పఠించడం వల్ల గ్రహ దోషాలు, గాలి ధూళి వంటి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది.
జాగ్రత్తలు:
ఈ పవిత్రమైన రోజున ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు (మే 1) ఉదయం 6:15 గంటల తర్వాతే దీక్షను విరమించాలి.
తెలంగాణలోని యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆడంబరం కన్నా అచంచలమైన విశ్వాసంతో స్వామిని కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, భయాందోళనలు తొలగి ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.
