Mohini Ekadashi 2026 : ఏప్రిల్ 27న అత్యంత శక్తివంతమైన మోహిని ఏకాదశి.. పూజా సమయం, ఉపవాసం నియమాలు.. పూర్తి వివరాలు ఇక్కడ..!
Mohini Ekadashi 2026 : ఏకాదశి తిథుల్లో మోహని ఏకాదశి అత్యంత శక్తివంతమైనది. ఏప్రిల్ 27, సోమవారం మోహని ఏకాదశి. మరి పూజా విధానం, ఉపవాస నియమాల గురించి
Mohini Ekadashi 2026 significance puja muhurat fasting rules full details in telugu
Mohini Ekadashi 2026 : హిందువులు ఏకాదశిని చాలా పవిత్రమైన తిథిగా భావిస్తారు. ప్రతి నెలా రెండు ఏకాదశి తిథులు వస్తాయి. చాలా మంది హిందువులు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు. అయితే వీటిల్లో కొన్ని ఏకాదశి తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిదే మోహినీ ఏకాదశి. ఎంతో శక్తివంతమైన ఈ మోహినీ ఏకాదశికి హిందూ పురాణాల్లో విశేష స్థానం ఉంది.
వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏడాది ఈ పర్వదినం 2026 ఏప్రిల్ 27న వస్తుంది. ఈసారి మోహినీ ఏకాదశికి మరింత ప్రాముఖ్యత ఉంది. కారణం.. ఈ సంవత్సరం ఏకాదశి సోమవారం నాడు రావడం. సోమవారం మరియు ఏకాదశి రెండు కలిసి రావడం చాలా అరుదని పండితులు చెబుతున్నారు.
పురాణ కథ
క్షీర సాగర మథనం సమయంలో విష్ణుమూర్తి మోహినీ అవతారం ధరించి.. రాక్షసుల బారి నుంచి అమృతాన్ని రక్షించిన సంగతి తెలిసిందే. శ్రీహరి ఈ అవతారం ఎత్తిన రోజు ఏకాదశి కావడంతో దీనిని ‘మోహినీ ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల వెయ్యి యజ్ఞాలు చేసినంత, వెయ్యి ఆవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
తేదీ, పూజా సమయాలు
- ఏకాదశి తిథి ప్రారంభం: 2026 ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 06:06 గంటలకు.
- ఏకాదశి తిథి ముగింపు: 2026 ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 06:15 గంటలకు.
- పూజ ముహూర్తం: ఏప్రిల్ 27 ఉదయం 09:02 నుండి 10:40 వరకు.
- ఉపవాస విరమణ (పారణ): ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 05:43 నుండి 08:21 గంటల మధ్య.
పూజా విధానం, శుభ సమయం
- బ్రహ్మ ముహూర్తం: ఏప్రిల్ 27 ఉదయం 04:15 నుండి 05:30 గంటల మధ్య నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడం ఉత్తమం.
- పూజా సమయం: ఉదయం 06:00 నుండి 08:00 గంటల లోపు లేదా మధ్యాహ్నం 11:45 నుండి 12:30 మధ్య వచ్చే అభిజీత్ ముహూర్తంలో పూజ చేయవచ్చు.
- అభిషేకం: విష్ణుమూర్తికి పంచామృతాలతో (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార) అభిషేకం చేయాలి.
- అలంకరణ: స్వామివారిని పసుపు రంగు పూలు, తులసి దళాలతో పూజించాలి.
- నైవేద్యం: ఐదు రకాల పండ్లు, పాలతో చేసిన తీపి ప్రసాదాలను సమర్పించాలి.
- మంత్రం: పూజ తర్వాత “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఉపవాస నియమాలు
- ఆరోగ్యవంతులు నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం ఉండవచ్చు. లేని పక్షంలో పాలు, పండ్లు తీసుకుంటూ ఫలహార ఉపవాసం చేయవచ్చు.
- ఏకాదశి రోజున అన్నం, పప్పులు, గోధుమలు, ఉప్పు వంటివి అస్సలు తీసుకోకూడదు.
- దశమి రాత్రి నుంచే బ్రహ్మచర్యం పాటిస్తూ, సాత్విక ఆహారం తీసుకోవాలి.
