అక్టోబర్ 3నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారు ఏరోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారంటే?

ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమై 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

vijayawada Kanaka Durga Temple

Dasara Navaratri Celebrations : ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమై 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దుర్గమ్మ దర్శనార్ధం భక్తులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్ల నిర్వహణ, బందోబస్తు, వాహన పార్కింగ్, భక్తులకు వసతి సౌకర్యాలు తదితర విషయాలపై ఆలయ ఆధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. అక్టోబర్ 3వ తేదీన ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీన విజయదశమి వేడుకతో ముగుస్తాయి. అదేరోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరగనుంది. ఇదిలాఉంటే.. శరన్నవరాత్రులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ముల్లోకాలకు మూలపూటమ్మ దుర్గమ్మను ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో దర్శిస్తే ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చనని భక్తులు విశ్వసిస్తారు.

Also Read : జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో స్వామీజీల సమావేశం.. ఏమన్నారంటే?

964 ఆర్టీసీ బస్సులు..
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 13రోజుల పాటు మొత్తం 964 బస్సులు తిప్పేలా ఆర్టీసీ ప్రణాళికలు చేసింది. హైదరాబాద్, రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, బెంగళూరు, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి బస్సులను నడపనుంది. ఈ ఏడాది అన్ని మార్గాల్లోకంటే హైదరాబాద్ కు అత్యధికంగా 353 బస్సులను నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

 

దసరా నవరాత్రుల్లో అమ్మవారు ఏరోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం.
◊  అక్టోబర్ 3న – బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం
◊  అక్టోబర్ 4న – గాయత్రీ దేవి అలంకారం
◊  అక్టోబర్ 5న – అన్నపూర్ణా దేవీ అలంకారం
◊  అక్టోబర్ 6న – లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
◊  అక్టోబర్ 7న – మహా చండీ దేవి అలంకారం.
◊  అక్టోబర్ 8న – మహాలక్ష్మీ దేవి అలంకారం
◊  అక్టోబర్ 9న – సరస్వతీ దేవి అలంకారం (మూల నక్షత్రం)
◊  అక్టోబర్ 10 – దుర్గాదేవి అలంకారం (దుర్గాష్టమి)
◊  అక్టోబర్ 11 -మహిషాసుర మర్దిని దేవి అలంకారం (మహర్నవమి)
◊  అక్టోబర్ 12 – ఉదయం మహిషాసుర మర్దిని దేవిగా.. సాయంత్రం రాజరాజేశ్వరి దేవిగా అలంకారం (విజయదశమి)