Dasara Utsavalu 2021 : గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

విజయవాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ వారు  శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున ఆశ్వయుజ శుధ్ధ తదియ శనివారం నాడు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు

Dasara Utsavalu 2021 :  విజయవాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ వారు  శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున ఆశ్వయుజ శుధ్ధ తదియ శనివారం నాడు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం !
గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం
శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే !!

వేద‌మాత‌గా ప్ర‌సిద్ధి పొందిన ఈ త‌ల్లి … ముక్తా, విద్రుమ‌, హేమ‌, నీల‌, ధ‌వ‌ళ వ‌ర్ణాల‌తో ప్ర‌కాశిస్తూ భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది. పంచ ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చే సంధ్యావంద‌న అధిష్టాన దేవ‌త అయిన గాయ‌త్రీదేవిని పూజిస్తే స‌క‌ల ఉప‌ద్ర‌వాలూ తొల‌గుతాయ‌నీ, బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ రోజున వంగ‌, ఆకుప‌చ్చ‌, బంగారు వ‌న్నెల చీర‌ల్లో కొలువుదీరిన అమ్మ‌వారికి నైవేద్యంగా పులిహోర‌, కేస‌రి, పుల‌గాల‌ను స‌మ‌ర్పిస్తారు.

సకల మంత్రాలకీ మూలమైనశక్తిగా, వేదమాతగా ప్రసిధ్ధి పొంది ముక్తా విద్రుమహేమనీలదవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి.  న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము – అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము ‘గయ’, ‘త్రాయతి’ అను పదములతో కూడుకుని ఉంది.

“గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ” అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. ‘గయలు’ అనగా ప్రాణములు అని అర్థము. ‘త్రాయతే’ అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు.

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం…భర్గో దేవస్య ధీమహి..ధియోయోనః ప్రచోదయాత్

ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.

ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్తదేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మ వారినిదర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించటం వలన సకల మంత్ర సిధ్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.  నవదుర్గ అలంకారాలలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీశైలంలో చంద్రఘటాదేవిగా, మైసూర్ లో కౌమారీదేవిగా, ఉత్తర భారతదేశంలో కళ్యాణగా దశమహావిద్యలలో తారాదేవిగా భక్తులుపూజిస్తారు.

 

ట్రెండింగ్ వార్తలు