Tiruchanuru Pushpa Yagam
Tiruchanoor Maha Pushpa Yagam : కరోనా కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్ధానం తిరుచానూరు ఈపద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం ఈ రోజు ముగిసింది. జూలై 16వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు 9 రోజుల జరిగిన ఈ మహాయాగాన్ని శనివారం ఉదయం రుత్వికులు శాస్త్రోక్తంగా ముగించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. ఇందులో భాగంగా నిత్య హవనం, మహా ప్రాయశ్చిత హోమం, మహా పూర్ణాహూతి, కుంభ ప్రోక్షణ నిర్వహించారు.
అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు, శ్రీ చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. తరువాత గంగాళంలో శ్రీ చక్రతాళ్వార్‌కు వేద మంత్రోచ్ఛారణల నడుమ చక్రస్నానం నిర్వహించారు. ముగింపు కార్యకమంలో పాల్గోన్న టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు