హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. 2020 వ సంవత్సరంలో రధ సప్తమి ఫిబ్రవరి1 శనివారం నాడు వచ్చింది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము “హిరణ్యయేన సవితారథేన” అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభం తర్వాత వచ్చే సప్తమి తిధి రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు.
మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన డిస నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని చెపుతున్నాయి మన శాస్త్రాలు.
వివిధ దేశాలు, విభిన్న వ్యక్తులు, అనేక కుల మతాలు, రకరకాల జీవ రాసులు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో రకాలు ఉన్నా, అందరికీ, అన్నిటికీ…, ప్రపంచ మంతటికీ, ఉనికినీ, మనుగడనీ, ప్రసాదించేది ఒక్క సూర్య భగవానుడే. ఆయనే మనకు ప్రత్యక్ష దైవం. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికీ, ఆరోగ్యానికీ, అన్నిటికీ ఆ సూర్యుడే. సూర్యుడు లేనిదే జగత్తు లేదు. సూర్యుడు అతిధి కశ్యపుల కుమారుడు. అందుకే ఆయన ఆదిత్యుడు. కర్మసాక్షి ఐన సూర్య భగవానుడు, కుసుమ వర్ణంతో ఉంటాడు.
ఉదయం బ్రహ్మ స్వరూపం
మధ్యాహ్నంతు మహేశ్వరం,
సాయంకాలే స్వయం విష్ణుః,
త్రిముర్తిస్తూ దివాకరః
సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని, ఉత్తరాయణంలో ప్రవేశించటానికి సూచనగా మనం రెండు పర్వదినాలను జరుపుకుంటాం. ఒకటి సంక్రాంతి రెండవది రథ సప్తమి. సప్తమి సూర్యుని జన్మ తిధి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు, జరుపుకునే రథ సప్తమి సూర్య సంబంధమైన పండుగ.
జపా కుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్భుతం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సప్తమీ రూప సూర్యుని రధ౦ దక్షిణాయన౦లో దక్షిణ దిశగా పయనిస్తు౦ది. అప్పుడు సూర్యుడు భూమికి దూర౦గా పోతూ ఉ౦డుటచే శీత కిరణుడైన౦దున వాతావరణ౦, ప్రాణికోటి జఠరాగ్ని మ౦దగిస్తూ ఉ౦టు౦ది. ఇక పుష్యమాస౦ చివరలో ఉత్తరాయణ౦ ప్రార౦భ౦. మాఘ శుధ్ధ సప్తమి నాడు సూర్యరధ౦ ఉత్తర దిక్కువైపుకు తిరుగుతు౦ది. అ౦దుచే మాఘసప్తమికి రధసప్తమి అని పేరు.
సూర్యుని ఏకాదశ మంత్రములు :
ఓం మిత్రాయ నమః , ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః ,ఓం భానవే నమః , ఓం ఖగాయ నమః , ఓం పూష్ణే నమః , హిరణ్యగర్భాయ నమః , ఓం మరీచయే నమః , ఓం ఆదిత్యాయ నమః , ఓం సవిత్రే నమః , ఓం అర్కాయ నమః , ఓం భాస్కరాయ నమః
ఏ రోజున అరుణోదయ కాలంలో సప్తమీతిథి ఉంటుందో, ఆ రోజునే స్నానాన్నీ, రథసప్తమీ వ్రతాన్ని చేయాలి. ఒకవేళ రెండు రోజులలోని అరుణోదయాలలోను సప్తమి ఉంటే,మొదటి రోజే రథసప్తమిగా భావించాలి. షష్టి నాడు ఒంటిపూట భోజనంతో ఉండి, సప్తమినాడు ఉదయాన్నే స్నానం చేసి,సువర్ణ – రజత- తామ్ర – లోహ పాత్రలలో దేనిలో నైనా తైలంపోసి దీపం వెలిగించి, సూర్య ప్రతిమను ప్రతిష్టించి , షోడశోపచారాలతోనూ పూజించాలి. ఆ పుణ్యకాలం సంక్రాతి పుణ్యకాలం వంటిది. అలాంటి పుణ్యకాలంలో గంగాది పుణ్య నదులలో దీపాలని వెలిగించి, పితృతర్పణం మొదలైనవి ఆచరించి,సూర్యోపాసన చేసినవారికి – గత ఏడు జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెపుతున్నాయి. షష్టీ సప్తమీ యోగము ‘పద్మకం’ అని చెప్పబడుతోంది. ఇటువంటి యోగం వేయి సూర్య గ్రహణాలతో సమానమని గర్గ మహామునిచే భోధించబడింది.
భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రత విధానాలు, విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి.
ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. “నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.
మాఘ మాసంలో రధ సప్తమే కాదు, సూర్యుడికి ముఖ్యమైన ఆదివారాలన్నీ కూడా విశేషమైనవే. ఏ కారణంవల్లనైనా రధసప్తమినాడు పై విధంగా సూర్యారాధన చేయలేనివారు మాఘ ఆదివారంనాడు చేస్తారు. అంతేకాదు ఈ మాసంలో సముద్రస్నానం కూడా విశేషమైనదే. ఉదయం నుంచి అస్తమయందాకా (ఆ మాటకొస్తే సర్వకాల సర్వావస్ధలలో) తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామికి నమస్కారం చెయ్యకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ వున్నారు. అను నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ తమ ఆరోగ్యం, ఐశ్వర్యాలని కాపాడుకునే భక్తులు అనేకులు ఉన్నారు.