Kodanda Ramalayam
Tirupati : తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం అనంతరం భాష్యకార్ల సన్నిధి వద్ద యిహల్ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు.