అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న జగన్

  • Publish Date - May 16, 2019 / 04:05 PM IST

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్‌పీర్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్‌ సమర్పించారు. అనంతరం  రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్యే అంజాద్ భాష ఏర్పాటు చేసిన ఇప్తార్ విందులో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన దివంగత ముజావర్‌ (దర్గా
పీఠాధిపతులు)లకు నివాళులర్పించారు.  జగన్ దర్గాకు  రావటంతో దర్గా పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. జగన్ తో పాటు మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి , రఘరామిరెడ్డిలు విందులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం కంటే ముందుగా దర్గాకు చేరుకున్న వైఎస్ జగన్ కు దర్గా మత పెద్దలు ఘన స్వాగతం పలికారు.రెండు రోజుల  కడప పర్యటనలో భాగంగా ఆయన బుధవారం జిల్లాకు
వచ్చారు. పోలింగ్‌ అనంతరం ఆయన తొలిసారిగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నెల23న ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లకు వైఎస్‌ జగన్‌
దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.