India vs Pakistan
India vs Pakistan clash : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు తలపడ్డాయి. ఈ ఏడు మ్యాచుల్లోనూ భారత జట్టే గెలుపొందింది. ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న మ్యాచులో సైతం టీమ్ఇండియా విజేతగా నిలిచి విజయాల సంఖ్యను మెరుగుపరచుకోవాలని చూస్తుండగా, ప్రపంచకప్‌లో భారత చేతిలో పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలని పాకిస్తాన్ పట్టుదలగా ఉంది.
ఇక వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడిన సందర్భాల్లో టీమ్ఇండియా చేసిన అత్యధిక స్కోరు 336 కాగా.. పాకిస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 273. భారత అత్యల్ప స్కోరు 216 కాగా.. పాకిస్తాన్ అత్యల్ప స్కోరు 173 కావడం గమనార్హం.
ఏ మ్యాచులో ఎన్ని పరుగులతో భారత్ గెలిచిందంటే..?
సిడ్నీలో 43 పరుగులతో..
భారత్, పాకిస్తాన్ జట్లు 1992 వన్డే ప్రపంచకప్‌లో మొదటి సారి తలపడ్డాయి. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం పాకిస్తాన్ 173 పరుగులకే కుప్పకూలింది. అమీర్ సొహైల్ 62 పరుగులు చేసినా మిగిలిన వాళ్లు విఫలం కావడంతో పాక్ 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ 1992 ప్రపంచకప్ విజేతగా నిలవడం విశేషం.
బెంగళూరులో 39 పరుగులతో..
1996 ప్రపంచకప్‌లో రెండోసారి భారత్, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ (93) ఏడు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకోగా.. ఆఖర్లో అజయ్ జడేజా (45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో పాకిస్తాన్ లక్ష్యాన్ని 49 ఓవర్లకు 288గా నిర్ణయించగా పాక్ 9 వికెట్ల నష్టానికి 248 పరుగులకే పరిమితమైంది.
World Cup 2023 BAN vs NZ ODI : సచిన్-సెహ్వాగ్‌ల రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ జోడీ
మాంచెస్టర్‌లో 47 పరుగుతో..
భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ఈ టోర్నమెంట్ జరగడంతో ఈ మ్యాచ్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. 1999 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అజారుద్దీన్ (59) అర్థశతకంతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్ ఐదు వికెట్లతో విజృంభించడంతో 180 పరుగులకే పాక్ కుప్పకూలింది.
సెంచూరియన్‌లో 6 వికెట్ల తేడాతో..
2003 ప్రపంచకప్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సచిన్, షోయబ్ అక్తర్ ల మధ్య మంచి పోటీ జరిగింది. షోయబ్ బౌన్సర్లతో సచిన్‌ను ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నించగా అప్పర్ కట్‌లతో మాస్టర్ బ్లాస్టర్ అలరించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. సయ్యిద్ అన్వర్ (101) శతకంతో చెలరేగడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్ 45.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సచిన్ (98) రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా యువరాజ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు.
మొహాలీలో 29 పరుగులతో..
2011 ప్రపంచకప్‌లో సచిన్ మరోసారి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 85 పరుగులు చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం మిస్బా ఉల్ హక్ 56 పరుగులతో రాణించినప్పటికీ పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది.
ఇక 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది.
World Cup 2023 IND vs PAK : పాకిస్తాన్‌తో మ్యాచ్.. గిల్ ఖచ్చితంగా ఆడతాడు : ఎంఎస్‌కే ప్రసాద్
అడిలైడ్‌లో 76 పరుగులతో..
2015 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ (107) శతకంతో చెలరేగడంతో అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మహ్మద్ షమీ నాలుగు వికెట్లతో చెలరేగడంతో 47 ఓవర్లలో పాక్ 224 పరుగులకే కుప్పకూలింది.
మాంచెస్టర్ 47 పరుగుల తేడాతో..
2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ (140) భారీ సెంచరీతో విరుచుకుపడడంతో మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లకు 302గా సవరించారు. అయితే పాక్ 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులకే పరిమితమైంది.